జన్నారం, ఏప్రిల్ 16 (ఆంధ్రప్రభ): భూభారతి ఆర్.ఓ.ఆర్ కొత్త చట్టం వల్ల అనేక కీలక సమస్యలకు పరిష్కార మార్గం సులభతరమని, నిరుపేద రైతులకు డబ్బులు ఖర్చు లేకుండా త్వరితగతిన భూ సమస్య పరిష్కరింపబడుతుందని, మ్యాప్ వేయడం వల్ల మరింత సులభమని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ స్పష్టం చేశారు.మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం భూభారతి ఆర్.ఓ.ఆర్ కొత్త చట్టంపై జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు.
ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆర్.ఓ.ఆర్ కొత్త చట్టాన్ని రూపొందించిందన్నారు. ఈ చట్టం వల్ల నిజమైన భూమి యజమానికి న్యాయం జరుగుతుందని ఆయన చెప్పారు. తమ పరిధిలో పరిష్కారం కానీ, కోర్టు పరిధిలో ఉన్న భూ సమస్యల పరిష్కారం కోసం నిరుపేద రైతుల కోసం ఈ చట్టం ద్వారా పరిష్కరించడానికి వీలు కల్పించిందని ఆయన చెప్పారు.
గతంలో ఉన్న ధరణి స్థానంలో ఈ కొత్త చట్టం రూపొందించారని, దీనివల్ల భూ సమస్యలుంటే చాలా వరకు జిల్లా పరిధిలోనే పరిష్కరించబడతాయని, కొత్త చట్టంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ మోతిలాల్, మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్ రావు, ఎడీ శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి కల్పన, స్థానిక తహసీల్దార్ రాజమనోహర్ రెడ్డి, ఎంపీడీవో హుమర్ షరీఫ్, స్థానిక వ్యవసాయ శాఖ అధికారిణి కస్తూరి సంగీత, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, పొనకల్, చింతగూడ సింగల్ విండో చైర్మన్లు అల్లం రవి, నాసాని రాజన్న, తదితరులు పాల్గొన్నారు.