మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుదాం: ఎస్సై సాయి కిరణ్

కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలంలోని కొండుకూర్ గ్రామంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా మంగళవారం ఘనంగా వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కడెం పోలీస్ స్టేషన్ ఎస్సై సాయి కిరణ్, నిర్మల్ జిల్లా ఉప సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు పొద్దుటూరి సంపత్‌రెడ్డి హాజరై మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మొక్క అంటే కేవలం చెట్టు కాదు.. భావితరాలకు ఇచ్చే జీవదానం అని అన్నారు. ఒక్క చెట్టు సంవత్సరానికి సుమారు 20 కిలోల కార్బన్ డైఆక్సైడ్‌ను పీల్చుకుని స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను అందిస్తుందని తెలిపారు.

వేసవి ఉష్ణోగ్రతలను తగ్గించడంతో పాటు వర్షాలు కురిసేందుకు, మట్టి కోతను నివారించేందుకు, భూగర్భ జలాలను పెంపొందించేందుకు చెట్లు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. పక్షులు, ఇతర జీవరాశులకు ఆశ్రయం కల్పించి పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో వృక్షాలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి అరుణ, జీపీవో విజయ్, అంగన్‌వాడీ టీచర్ గంగమణి, నాయకులు ముక్కర గంగాధర్, అంజన్న, గ్రామ పంచాయతీ సిబ్బంది, యువకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.