జానకంపల్లిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ..

శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం జానకంపల్లి గ్రామంలో శనివారం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు అందజేశారు.

కలెక్టర్ గ్రామంలో ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులను కలుసుకుని పింఛను నగదును వారి చేతికి అందించారు. వృద్ధులు, వితంతువులతో ఆప్యాయంగా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి, కుటుంబ యోగక్షేమాలు, గ్రామంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జానకంపల్లి గ్రామానికి చెందిన అన్నగిరి అచ్చమ్మకు (వృద్ధాప్య పింఛను – రూ.4,000), బ్యాళ్ల లక్ష్మీనారాయణకు (వృద్ధాప్య పింఛను – రూ.4,000), ఎ. చిన్నగమ్మకు (వితంతు పింఛను – రూ.4,000) కలెక్టర్ చేతుల మీదుగా పింఛన్లు అందజేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సకాలంలో, పారదర్శకంగా ఇంటి వద్దకే పింఛను అందించడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పింఛన్ల పంపిణీ ప్రక్రియలో ఎలాంటి లోపాలు చోటుచేసుకోకుండా అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వ సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, మండల స్థాయి అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.