Fire| కారు దగ్ధంతో కలకలం..

Fire| ధర్పల్లి, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలో అర్ధరాత్రి జరిగిన కారు దహనం గ్రామంలో కలకలం రేపింది. గతంలో గ్రామానికి చెందిన పలువురు వ్యక్తులకు చెందిన బైకులు గుర్తుతెలియని వ్యక్తులు దగ్దం చేయడం జరిగింది. వరుసగా గ్రామంలో బైకులు దహనం అవుతుండడంతో గ్రామంలో ఆరు బయట వాహనాలు నిలపాలంటే వాహనదారులు భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా చెలిమెల రంజిత్ అనే వ్యక్తికి చెందిన టీయస్ 16 ఈయన్ 4656 నెంబర్ గల మహీంద్రా ఎక్యువీ 300 కారు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించడంతో పూర్తిగా దగ్ధం కావడం జరిగింది.
రోజులాగే తన వాహనాన్ని పార్కింగ్ చేసిన చెలిమెల రంజిత్ కు అర్ధరాత్రి సమయంలో తన కారు దగ్దం అవుతుందనే సమాచారంతో అక్కడికి వెళ్లగా అప్పటికే కారు పూర్తిగా మంటల్లో చిక్కుకుందని,పోలీస్ వారికి సమాచారం ఇవ్వడంతో సబ్ ఇన్స్పెక్టర్ కళ్యాణి అక్కడికి చేరుకొని ఫైర్ ఇంజన్ కు కాల్ చేయగా వారు వచ్చి మంటలు ఆర్పగా అప్పటికే కారు పూర్తిగా దహనం అయ్యింది. గ్రామంలో వరుసగా వాహనాలు దగ్దం అవుతుండడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా వరుస దహనాలు చేస్తున్న వారిని పట్టుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.కారు యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని,అనుమానస్పద వ్యక్తులు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని సబ్ ఇన్స్పెక్టర్ కళ్యాణి ప్రజలను కోరారు.
