డీఎస్సీ 2025 మెరిట్ లిస్టులో అక్రమాలు జరిగాయి: బీఎస్పీ

డీఎస్సీ 2025 మెరిట్ లిస్టులో అక్రమాలు జరిగాయి: బీఎస్పీ

శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ: డీఎస్సీ 2025 మెరిట్ లిస్టులో పలు అక్రమాలు చోటుచేసుకున్నాయని బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు ఆరోపించారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీఎస్పీ నేతలు డీఎస్సీ 2025 నియామకాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి అంపావతిని గోవిందు మాట్లాడుతూ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అభ్యర్థులను మోసగించేందుకే ప్రభుత్వం డీఎస్సీ 2025 మెరిట్ లిస్టును వెల్లడించలేదని ఆరోపించారు.

గతంలో నిర్వహించిన అన్ని డీఎస్సీలలో మెరిట్ లిస్టులను ప్రభుత్వాలు బహిర్గతం చేసేవని అన్నారు. అయితే, ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ 2025 మెరిట్ లిస్టును విడుదల చేయకపోవడం అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు కారణంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అభ్యర్థుల కంటే తక్కువ మార్కులు సాధించిన ఓసీ అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించే పరిస్థితి ఏర్పడిందని గోవిందు ఆరోపించారు. మెరిట్ లిస్టు బయటపెడితే ఈ విషయాలు బహిర్గతమవుతాయని భావించి ప్రభుత్వం దానిని విడుదల చేయలేదని అన్నారు.

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలోనే రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ అమలు ప్రారంభమైందని ఆయన విమర్శించారు. ప్రస్తుతం అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ ఓసీ వర్గాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. డీఎస్సీ 2025లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని బీఎస్పీ డిమాండ్ చేసింది. తక్కువ మార్కులు సాధించిన ఓసీ అభ్యర్థులకు ఇచ్చిన ఉద్యోగాలను రద్దు చేసి, అధిక మార్కులు సాధించిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అభ్యర్థులకు అవకాశం కల్పించాలని కోరింది.

ఈ సమావేశంలో బహుజన నాయకులు రొడ్డార్పు హరిప్రసాద్, గంగులప్ప, సుధాకర్, హస్సన్ భాష, వెంకటేష్, వెంకటసుబ్బయ్య, చంద్రశేఖర్, ప్రసాద్, తిరుపాలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply