ఈ నెల 20 తర్వాత ఇక వర్షాలే…
ఆంధ్రప్రభ, హైదరాబాద్ : ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటున్న రైతులకు వాతావరణ నిపుణులు ఊరటనిచ్చే అంచనా వెల్లడించారు. ఈ నెల 20వ తేదీ తర్వాత దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. వాతావరణ శాఖ నిపుణుల వివరాల ప్రకారం.. ప్రస్తుతం ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ (ITCZ) బంగాళాఖాతం నుంచి పసిఫిక్ మహాసముద్రం వరకు సుమారు 7,000 నుంచి 10,000 కిలోమీటర్ల మేర విస్తరించింది. ఈ వ్యవస్థ ప్రభావంతో వెచ్చని, తేమతో కూడిన గాలులు పైకి ఎగసి భారీ మేఘాలు ఏర్పడే పరిస్థితులు నెలకొంటున్నాయని పేర్కొన్నారు.
దీని ప్రభావంతో జులై 20 నుంచి 30వ తేదీ మధ్య దేశంలోని అనేక ప్రాంతాల్లో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయానికి అనుకూలంగా మంచి వర్షాలు కురిసే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే వర్షాభావం కారణంగా పంటలు ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో రానున్న వర్షాలు ఖరీఫ్ పంటలకు ఊరటనిచ్చే అవకాశముందని వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, వర్షాల తీవ్రత, పంపిణీపై మరింత స్పష్టత రానున్న రోజుల్లో లభించే తాజా వాతావరణ అంచనాల ఆధారంగా తెలుస్తుందని అధికారులు తెలిపారు.
