రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్..
- ఏబీవీపీ పిలుపు…
ఆంధ్రప్రభ, హైదరాబాద్ : తెలంగాణలో విద్యా రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చింది. ప్రభుత్వం విద్యా వ్యవస్థలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని ఆరోపిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏబీవీపీ రాష్ట్ర నాయకత్వం తెలిపింది.
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. జూనియర్ కాలేజీల నుంచి విశ్వవిద్యాలయాల వరకు అన్ని విద్యాసంస్థలు బంద్‌లో పాల్గొని ఉద్యమాన్ని విజయవంతం చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చింది.
ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు మాట్లాడుతూ, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. నిధులు విడుదల చేయకుండా కాలయాపన చేయడం వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా లక్షలాది మంది విద్యార్థుల ఉన్నత విద్య ప్రమాదంలో పడే పరిస్థితి నెలకొందని ఆయన అన్నారు. పెండింగ్ ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని, లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
మరోవైపు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి పాచ్చిరాజు హర్షవర్ధన్ మాట్లాడుతూ, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులంతా శాంతియుతంగా బంద్‌లో పాల్గొని తమ హక్కుల సాధనకు మద్దతు ఇవ్వాలని కోరారు.
విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు బంద్‌కు సహకరించి విద్యా వ్యవస్థ పరిరక్షణకు మద్దతు తెలపాలని ఏబీవీపీ నాయకులు విజ్ఞప్తి చేశారు.
