మౌనిక ఆత్మహత్య కేసు.. భర్త, అత్తమామలకు రిమాండ్

  • 12 ఏళ్ల వేధింపులే మృతికి కారణమని ఆరోపణలు..
  • ఆదిలాబాద్ జైలుకు తరలింపు

జన్నారం, ఆంధ్రప్రభ : జన్నారం మండలం చింతలపల్లికి చెందిన పంజాల మౌనిక (29) ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మౌనికను వేధించి ఆత్మహత్యకు ప్రేరేపించిన ఆరోపణలపై ఆమె భర్త, అత్తమామలను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారికి రిమాండ్ విధించింది.

పోలీసుల వివరాల ప్రకారం.. చింతలపల్లికి చెందిన పంజాల మౌనిక గత ఆదివారం మృతి చెందింది. భర్త పంజాల రవిగౌడ్, అత్త రాజవ్వ, మామ రాజగౌడ్ గత 12 సంవత్సరాలుగా ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించారని మృతురాలి తల్లి పరకాల లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన జన్నారం పోలీసులు దర్యాప్తు చేపట్టి, ముగ్గురిని సోమవారం సాయంత్రం అరెస్టు చేశారు. అనంతరం వారిని మంచిర్యాల కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి రిమాండ్ విధించారు. దీంతో నిందితులను ఆదిలాబాద్ జిల్లా జైలుకు తరలించినట్లు జన్నారం ఎస్సై గుర్రం ఉదయ్‌కిరణ్ తెలిపారు. మౌనిక మృతికి గల అన్ని కారణాలపై సమగ్రంగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.