బంగారం, నగదు కోసం దారుణం

బంగారం, నగదు కోసం దారుణం

గన్నవరం మహిళ హత్య కేసులో కీలక మలుపు

మచిలీపట్నం, ఆంధ్రప్రభ: కృష్ణా జిల్లా గన్నవరం సబ్‌డివిజన్ పరిధిలో సంచలనం సృష్టించిన ఒంటరి మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, సుమారు రూ.56 లక్షల విలువైన బంగారం, నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు వెల్లడించారు.

గన్నవరం దావాజీగూడెం రోడ్డులోని జీకేఆర్ పారడైజ్ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ నంబర్ 401లో కాజ రజిత కుమారి (55) ఒంటరిగా నివసిస్తున్నారు. భర్త మరణానంతరం ఆమె శ్రీనగర్ కాలనీలో జ్యోతి పిండి మిల్లు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆమె ఇద్దరు కుమార్తెలు అమెరికాలో స్థిరపడ్డారు. మే 24న రాత్రి రజిత కుమారి తన కుమార్తెతో ఫోన్‌లో మాట్లాడుతుండగా, ఎవరో కాలింగ్ బెల్ కొట్టారని చెప్పి ఫోన్ పెట్టారు. ఆ తర్వాత ఆమె ఫోన్‌కు స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం కలిగింది.

మరుసటి రోజు ఉదయం పనిమనిషి ఇంటికి వచ్చి చూడగా, రజిత కుమారి బెడ్‌రూమ్‌లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్లు గుర్తించింది. వెంటనే 112కు సమాచారం ఇచ్చింది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు గన్నవరం పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సీసీ కెమెరాలతో కీలక ఆధారాలు

దర్యాప్తులో భాగంగా అపార్ట్‌మెంట్ సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు, మృతురాలికి పరిచయస్తురాలైన పోలవరపు సుష్మ, ఆమె కుమారుడు పోలవరపు అజయ్ కుమార్ మే 24న రాత్రి 10.07 గంటలకు ఫ్లాట్‌లోకి ప్రవేశించి, రాత్రి 11.17 గంటలకు బయటకు వెళ్లినట్లు గుర్తించారు. ఈ ఆధారాలతో కేసును మర్డర్ ఫర్ గెయిన్‌గా మార్చి, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు గన్నవరం ఇన్‌చార్జ్ డీఎస్పీ పాల శ్రీనివాస్ పర్యవేక్షణలో, గన్నవరం పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ సీఐ ఎల్. రమేష్ ఆధ్వర్యంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.

నిందితుల అరెస్ట్
దర్యాప్తులో లభించిన విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు గన్నవరం కోనయ్య చెరువు సమీపంలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి సుమారు రూ.56 లక్షల విలువైన బంగారం, నగదును స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిని పోలవరపు సుష్మ, పోలవరపు అజయ్ కుమార్‌గా గుర్తించారు.

నేరానికి కారణం
ప్రధాన నిందితురాలు పోలవరపు సుష్మకు ఓ వ్యక్తితో ఉన్న వివాహేతర సంబంధానికి మృతురాలు అడ్డుగా ఉందనే భావనతో పాటు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి వద్ద ఉన్న బంగారం, నగదును దోచుకోవాలనే ఉద్దేశంతో నేరం చేసినట్లు దర్యాప్తులో వెల్లడైందని చెప్పారు.
ఈ కుట్రలో సుష్మ కుమారుడు పోలవరపు అజయ్ కుమార్ సహకరించినట్లు పోలీసులు తెలిపారు. అజయ్ కుమార్‌పై గతంలో పలు క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయని, ఉయ్యూరు టౌన్ పోలీస్ స్టేషన్‌లో సస్పెక్ట్ షీట్ కూడా ఉన్నట్లు వెల్లడించారు. కేసును వేగంగా ఛేదించి నిందితులను అరెస్ట్ చేసిన పోలీసు బృందాన్ని జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు అభినందించారు.

Leave a Reply