బాలికలు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలి

బాలికలే రేపటి సమాజ నిర్మాణంలో కీలక శక్తి

ఊట్కూర్, ఆంధ్రప్రభ : సమాజ అభివృద్ధిలో బాలికల పాత్ర ఎంతో కీలకమని, వారు చదువుతోపాటు క్రీడలు, విజ్ఞానం, సాంకేతికత, నాయకత్వం, కళలు తదితర అన్ని రంగాల్లో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఊట్కూర్ సర్పంచ్ ఎం. రేణుక భరత్, మండల విద్యాశాఖ అధికారి మాధవి, ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ సంతోషి, ఓఐఎంఎఫ్ కోఆర్డినేటర్ హాజమ్మ పిలుపునిచ్చారు.

శుక్రవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో ‘బాలికల ప్రేరణ’ అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ, నేటి బాలికలే రేపటి సమాజ నిర్మాణంలో కీలక శక్తిగా నిలుస్తారని పేర్కొన్నారు.

విద్యతో పాటు ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, సమయపాలన, నైతిక విలువలను అలవర్చుకుంటే జీవితంలో ఏ లక్ష్యాన్నైనా సులభంగా సాధించవచ్చని సూచించారు.

బాల్య వివాహాలు, లింగ వివక్ష, మూఢనమ్మకాల వంటి సామాజిక దురాచారాలకు దూరంగా ఉండాలని, ఉన్నత విద్యను అభ్యసించి కుటుంబానికి, సమాజానికి ఆదర్శంగా నిలవాలని బాలికలకు సూచించారు. ప్రభుత్వం బాలికల విద్యాభివృద్ధి కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాహారం, శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఆరోగ్యవంతమైన జీవనశైలి విజయానికి పునాది అని వివరించారు.

ప్రతి విద్యార్థిని ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటి సాధన కోసం నిరంతరం శ్రమించాలని సూచించారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మార్గదర్శకత్వాన్ని సద్వినియోగం చేసుకుని విద్యలోనూ, ఇతర రంగాల్లోనూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.