విద్యార్థులకు న్యాయం జరిగే వరకు ఉద్యమిస్తాం
- విద్యా శాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి
- డిఎస్సీ కుంభకోణంపై సీబీఐ విచారణ చేపట్టాలి.
- వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు డిమాండ్
నర్సాపురం, ఆంధ్రప్రభ: రెండున్నరేళ్ల ప్రభుత్వ పరిపాలనలో యువతకు తీరని అన్యాయం జరిగిందని, విద్యార్థులకు న్యాయం చేసే విధంగా ఉద్యమించి ప్రభుత్వ మెడలు వంచుతామని వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమంలో భాగంగా నర్సాపురం పట్టణంలో శుక్రవారం చేపట్టిన నిరాహారదీక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం విద్యా రంగాన్ని భ్రష్టు పట్టించిందని, రెండున్నరేళ్లలో ఎన్నో అవకతవకలు, కుంభకోణాలు విద్యా వ్యవస్థలో జరుగుతున్నాయని ఆరోపించారు. యువతకు ఉద్యోగ అవకాశాలు లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల ముందు ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలను తీసేస్తున్నారని మండిపడ్డారు.
ఇచ్చిన హామీ ప్రకారం 20లక్షలు ఉద్యోగాలు ఎప్పటికీ ఇస్తారని, నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారని నిలదీశారు. ప్రతిభకు పట్టం కట్టాల్సిన ప్రభుత్వం వారికి తీవ్ర అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్షల ప్రశ్న పత్రాలు రెండు సార్లు లీకవ్వడం తో మెరిట్ విద్యార్థులు నష్టపోయారని తెలిపారు. దీంతో విద్యార్థులు, యువత ఉద్యమ బాత పట్టి కేంద్ర ప్రభుత్వం పై తిరగబడ్డారు. దీనికి బాధ్యత వహించిన కేంద్ర ప్రభుత్వం 60మంది అధికారులను సస్పెండ్ చేసిందని, కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేసిన విషయం తెలిసిందే అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం 16వేల టీచర్ పోస్టులు భర్తీ ప్రక్రియలో ఎన్నో అవకతవకలు, అక్రమాలకు పాల్పడిందని, సంబంధిత జీవో లను మార్పులు చేసిందని ఆరోపించారు. ఎటువంటి రాత పరీక్ష నిరహించకుండానే డీఎస్సీ పోస్టులు భర్తీ చేసి ఒక్కో పోస్ట్ కు రూ. 15లక్షల నుంచి రూ. 20లక్షలకు అమ్ము కోవడంతో రూ. 60కోట్లు కుంభకోణం జరిగిందని తెలిపారు. దీనిపై ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ మాత్రమే రాసి ఏ ఒక్కరినీ అరెస్ట్ చేయలేదన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించక పోవడమే కుంభకోణానికి నిదర్శనమన్నారు.
విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని, డిఎస్పీ నియామకాలపై సీబీఐ విచారణ చేపట్టాలని, అర్హులైన వారందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో భాగంగా 20లక్షల ఉద్యోగాలు లేదా యువతకు నిరుద్యగా భృతి కల్పించాలని, విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీయంబర్స్మెంట్, విద్యా దీవెన అందించాలని లేకపోతే ప్రభుత్వం మెడలు వంచి న్యాయం జరిగే వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
