అనుమతులు లేకుండా విచ్చలవిడిగా ఇళ్ల నిర్మాణాలు

లక్షల్లో ఆదాయం కోల్పోతున్న మున్సిపాలిటీ.. పట్టించుకోని అధికారులు
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ: బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో అనుమతులు లేకుండానే అక్రమ ఇళ్ల నిర్మాణాలు, బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలు కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులకు సమాచారం ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు.

మున్సిపల్ నిబంధనల ప్రకారం భవన నిర్మాణాలకు ముందస్తు అనుమతులు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ, కొందరు మధ్యవర్తులు, కింది స్థాయి సిబ్బంది సహకారంతో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో నిబంధనలు పాటించే వారికి అన్యాయం జరుగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పట్టణంలోని 13వ వార్డులో జాతీయ రహదారికి ఆనుకుని ఓ ఫంక్షన్ హాల్, 25, 34వ వార్డుల్లో బహుళ అంతస్తుల భవనాలు అనుమతులు లేకుండా నిర్మిస్తున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఈ నిర్మాణాల వల్ల భవన అనుమతి రుసుములు, ఇతర ఫీజుల రూపంలో మున్సిపాలిటీకి రావాల్సిన లక్షల రూపాయల ఆదాయం కోల్పోతున్నట్లు చెబుతున్నారు.
ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ స్పందించి, అనుమతులు లేకుండా కొనసాగుతున్న నిర్మాణాలపై తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
