రోడ్డు విస్తరణ పనులు త్వరగా పూర్తి చేయాలి..

చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గ కేంద్రంలో కొనసాగుతున్న రోడ్డు విస్తరణ పనుల్లో స్థానిక మునిసిపల్ అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారని, దీంతో వ్యాపారులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ నాయకులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూర్ కేంద్రంలో చేపట్టిన రోడ్డు పనులు నత్తనడకన సాగుతున్నాయని ఆరోపించారు. పనుల జాప్యంతో చిరు వ్యాపారులు ఆర్థికంగా నష్టపోతున్నారని తెలిపారు.

రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించి నాలుగు నెలలు గడుస్తున్నా అధికారులు బాధితులకు స్పష్టత ఇవ్వడం లేదని అన్నారు. పనులు ఎప్పుడు పూర్తవుతాయో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. రోడ్డు విస్తరణ పనులను త్వరగా పూర్తి చేసి ప్రజల ఇబ్బందులను తొలగించాలని కోరారు. లేనిపక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి దుర్గం అశోక్, మునిసిపల్ కౌన్సిలర్ గేర్రెపెల్లి శాంతారాణి, వెంకట నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.