SCHOOL | బాస్కెట్‌బాల్ పోటీలు ప్రారంభం

SCHOOL | బాస్కెట్‌బాల్ పోటీలు ప్రారంభం

ప్రారంభోత్స‌వానికి హాజ‌రైన చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి

SCHOOL | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : చిత్తూరు పట్టణంలోని పీఈఎస్ పాఠశాలలో (PES school) గురువారం ఆరంభమైన ఆరు రాష్ట్రాల బాస్కెట్‌బాల్ పోటీలను జిల్లా ఎస్పీ తుషార్ డూడి ప్రారంభించారు. ఆయన జంప్ బాల్ చేసి పోటీని అధికారికంగా ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులతో కలిసి ఆట ఆడి వారిలో ఉత్సాహం నింపారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ… చదువుతో పాటు క్రీడల ప్రాముఖ్యతను వివరించారు. క్రీడలు జట్టు భావం, క్రమశిక్షణ, పట్టుదల వంటి విలువలను మనలో పెంపొందిస్తాయని, ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో, సమయాన్ని సక్రమంగా ఎలా వినియోగించుకోవాలో నేర్చుకునే మార్గమని చెప్పారు.

అంతేకాకుండా ఆటలు ఆరోగ్యం మెరుగుపరచడమే కాకుండా చెడు అలవాట్ల నుంచి దూరంగా ఉంచుతాయని, సమాజంలో మంచి ఆదర్శాలుగా నిలవగలమని విద్యార్థులకు (Students) సూచించారు. మగపిల్లలతో సమానంగా క్రీడల్లో పాల్గొంటున్న ఆడపిల్లలను ప్రత్యేకంగా అభినందించి, వారు సమాజానికి గొప్ప స్ఫూర్తి అందిస్తున్నారని తెలిపారు. చదువుతో పాటు క్రీడల్లో సమతుల్యంగా ముందడుగు వేయాలని విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ వై.వి. కృష్ణబాబు, ఉప డివిజన్ డీఎస్పీ టి. సాయినాథ్, వెస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ నాయుడు, బాస్కెట్‌బాల్ సంఘ ప్రతినిధులు, స్థానిక అధికారులు పాల్గొన్నారు. పోటీకి అన్ని టీమ్‌లకు జిల్లా ఎస్పీ శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply