విద్యా హక్కుకు అక్షర రూపం…

విద్యా హక్కుకు అక్షర రూపం…

పాఠశాలలకు చేరుతున్న పాఠ్యపుస్తకాలు
కొత్త విద్యా సంవత్సరానికి ముందే సరఫరా
ఎన్టీఆర్ జిల్లా 20 మండలాలకు దశలవారీగా పంపిణీ
ఆర్టీసీ కార్గో సేవలతో స్టాక్ పాయింట్లకు తరలింపు
ఒక్క విద్యార్థి కూడా పుస్తకం లేకుండా ఉండొద్దన్న ప్రభుత్వ లక్ష్యం
పంపిణీకి పూర్తి ఏర్పాట్లు చేస్తున్న విద్యాశాఖ యంత్రాంగం

ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల చేతుల్లో పాఠ్యపుస్తకాలు ఉండేలా విద్యాశాఖ యంత్రాంగం క్షేత్రస్థాయిలో కదిలింది. వేసవి సెలవులు కొనసాగుతున్న వేళనే పాఠశాలల పునఃప్రారంభాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా పాఠ్యపుస్తకాల సరఫరా ప్రక్రియ వేగవంతం చేశారు . విద్యార్థి చదువు మొదలయ్యే తొలి రోజునే పుస్తకం అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో అధికారులు ముందస్తు ప్రణాళికతో పనిచేస్తున్నారు.

.. జిల్లాలోని అన్ని పాఠశాలలకు…

జిల్లాలోని 20 మండలాలకు 2026–27 విద్యా సంవత్సరానికి మొత్తం 1,4,78,848 పాఠ్యపుస్తకాలు అవసరమని విద్యాశాఖ అంచనా వేసింది. ఇందులో ఇప్పటివరకు జిల్లాకు 1,23,154 పాఠ్యపుస్తకాలు చేరినట్లు జిల్లా విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. మిగిలిన పుస్తకాలు కూడా పలు దఫాలుగా చేరనున్నాయని అధికారులు తెలిపారు. జిల్లాకు చేరిన పుస్తకాలను మండల విద్యా కార్యాలయాలు, క్లస్టర్ స్టాక్ పాయింట్లు, పాఠశాలలకు వేగంగా తరలిస్తున్నారు. ఇందుకోసం ఏపీఎస్ఆర్టీసీ కార్గో సేవలను వినియోగిస్తున్నారు. రవాణా నుంచి నిల్వ, పంపిణీ వరకు ప్రతి దశలో ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతోంది.

. ఒకటి నుండి పదవ తరగతి వరకు…

ఈ ఏడాది విద్యా సంవత్సరానికి మొదటి తరగతి నుంచి పదో తరగతి వరకు పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్స్ సిద్ధం చేసినట్లు విద్యా వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ అకాడమిక్ ప్రణాళిక ప్రకారం జూన్ నెలలో పాఠశాలలు పునఃప్రారంభమయ్యే అవకాశాల నేపథ్యంలో ముందస్తు పంపిణీకి ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థికి ఉచితంగా అన్ని పాఠ్యపుస్తకాలు అవసరమైన విద్యా కిట్లలో అందించనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.

… ప్రతి విద్యార్థికి ఉచితంగా..

జిల్లా విద్యాశాఖ అధికారి చంద్రకళ మాట్లాడుతూ, “ప్రతి విద్యార్థికి ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందించడం ప్రభుత్వ బాధ్యత. పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి ఒక్క పుస్తకం కూడా పెండింగ్‌లో లేకుండా చర్యలు తీసుకుంటున్నాం” అని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెరుగుతున్న నేపధ్యంలో సమయానికి పాఠ్యపుస్తకాల సరఫరా విద్యా ప్రమాణాల పెంపుకు కీలకంగా మారుతోంది. ‘విద్యా కానుక’ కేవలం సంక్షేమ పథకం మాత్రమే కాదు, విద్యార్థి భవిష్యత్తుకు ప్రభుత్వం ఇస్తున్న అక్షర భరోసాగా మారుతోందని అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply