Awareness | డ్రగ్స్ వద్దు… జీవితం కావాలి…

Awareness | డ్రగ్స్ వద్దు… జీవితం కావాలి…
- జగ్గయ్యపేటలో భారీ యాంటీ డ్రగ్స్ ర్యాలీ
Awareness | జగ్గయ్యపేట, ఆంధ్రప్రభ : మాదక ద్రవ్యాల ముప్పును సమాజం నుంచి తరిమికొట్టాలనే సంకల్పంతో జగ్గయ్యపేట పట్టణంలో ఈ రోజు అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈగల్ క్లబ్స్, ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ సంయుక్త ఆధ్వర్యంలో డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదంతో బస్టాండ్ సెంటర్ నుంచి భారీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), మున్సిపల్ చైర్మన్ రంగాపురం శ్రీరాం ధనుంజయ పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభంలో ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.
జగ్గయ్యపేట పట్టణ ప్రధాన రహదారుల వెంబడి సాగిన ర్యాలీలో పాల్గొన్న యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉందాం – విలువైన ప్రాణాలను కాపాడుకుందాం అంటూ నినాదాలు చేశారు. డ్రగ్స్ వల్ల యువత భవిష్యత్తు నాశనమవుతుందని, ప్రతి ఒక్కరూ మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని వక్తలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు జి. రాజు, నాయక్, ట్రాఫిక్ ఎస్సై ఆర్. శ్రీనివాసరావు, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు, క్లబ్ సభ్యులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని డ్రగ్స్ వ్యతిరేక సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు.
