Aviation | మామునూరు ఎయిర్పోర్టుపై కీలక చర్చ
Aviation | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ న్యూఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎంపీ రఘువీర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణలో పెండింగ్లో ఉన్న విమానాశ్రయాల అభివృద్ధి ప్రాజెక్టులపై ఇరువురు విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా అదిలాబాద్ విమానాశ్రయంతో పాటు వరంగల్లోని మామునూరు విమానాశ్రయం అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు.
మామునూరు విమానాశ్రయానికి సంబంధించిన డిజైన్, మౌలిక సదుపాయాల కల్పన, నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రిని కోరినట్లు సమాచారం. అదేవిధంగా అదిలాబాద్ విమానాశ్రయ అభివృద్ధికి అవసరమైన అనుమతులు, కేంద్ర సహకారం త్వరితగతిన అందించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది.
తెలంగాణలో ప్రాంతీయ విమాన సేవలను విస్తరించే దిశగా ఈ ప్రాజెక్టులు కీలకమని పేర్కొన్న సీఎం, పెండింగ్ ప్రతిపాదనలకు త్వరితగతిన ఆమోదం తెలపాలని కేంద్రాన్ని కోరారు. రాష్ట్రంలో రహదారులు, విమానాశ్రయాల మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
