అమరావతిపై వైసీపీ వైఖరి ఏమిటో చెప్పాలి…
అమరావతే రాష్ట్ర శాశ్వత రాజధాని..
జగన్ సభకు వచ్చి రాజధానిపై చర్చకు సిద్ధం మా..
వైసీపీ రోజుకో మాట దారుణం…
అవినీతి ఆరోపణలకు ఆధారాలు ఏవి…
యువత భవిష్యత్తు కోసం మే…
అంతర్జాతీయ ప్రమాణాలతో అమరావతి నిర్మాణం..
ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు…
పాయికాపురం, ఆంధ్రప్రభ : అమరావతి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఖరిలో స్పష్టత లేదని, ప్రతిపక్షంలో ఒక మాట, అధికారంలో మరో మాట, ఇప్పుడు మరో మాట మాట్లాడుతోందని విమర్శించారు. అమరావతే రాష్ట్ర శాశ్వత రాజధాని అని, దీనిని ఎవరూ మార్చలేరని స్పష్టం చేశారు. పత్రికా విలేకరులతో బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి అంశాలపై మాట్లాడేందుకు ఏమీ లేకపోవడంతో మళ్లీ అమరావతి అంశాన్ని తెరపైకి తీసుకొస్తోందని విమర్శించారు. 2014లో అసెంబ్లీ సాక్షిగా అమరావతికి మద్దతు తెలిపిన వైసీపీ, 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల పేరుతో మాట మార్చిందని ఆరోపించారు. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మళ్లీ కొత్త వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తోందని అన్నారు. మీ స్టాండ్ ఏంటి. అమరావతి, విశాఖ, విజయవాడ… రోజుకో మాట ఎందుకు మాట్లాడుతున్నారు అని ప్రశ్నించారు. అమరావతిని గతంలో శ్మశానంతో పోల్చి, వేస్ట్ ల్యాండ్ గా అభివర్ణించిన నాయకులు ఇప్పుడు అక్కడికి వెళ్లి రాజకీయాలు చేయాలని ప్రయత్నించడం సరికాదని విమర్శించారు. రైతుల ఆందోళనలను ప్రస్తావిస్తూ, అమరావతి ప్రజలు వైసీపీ వైఖరిని ఇప్పటికే తిరస్కరించారని వ్యాఖ్యానించారు. అమరావతి నిర్మాణంలో అవినీతి జరిగిందని ఆరోపణలు చేస్తున్న వారు మీడియా సమావేశాల్లో కాకుండా శాసనసభకు వచ్చి ఆధారాలతో చర్చించాలని బొండా సవాల్ విసిరారు. అవసరమైతే ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు, నెల రోజులైనా అమరావతిపై సభలో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసి, ఐటీ, పారిశ్రామిక, హోటల్ రంగాల్లో పెట్టుబడులు తీసుకువచ్చి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. నిర్మాణ వ్యయం ఎంత అన్నది కాకుండా, ఎలాంటి ప్రమాణాలతో రాజధానిని నిర్మిస్తున్నామన్నదే ముఖ్యమని పేర్కొన్నారు. అమరావతే రాష్ట్ర రాజధానిగా కేంద్రం నోటిఫై చేసిందని, రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా ఉన్నాయని బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. “ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా అమరావతే ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని. భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా దీనిని మార్చలేరు” అని స్పష్టం చేశారు. అవినీతి జరిగిందని ఆరోపణలు చేసే వారు నిర్దిష్ట ఆధారాలు చూపించాలని, లేకపోతే మీడియా ముందు నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలని బొండా ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు.
