వడ్డీ డబ్బులు అడిగినందుకు ఇంటిపై దాడి

వడ్డీ డబ్బులు అడిగినందుకు ఇంటిపై దాడి
అప్పుతీసుకొన్న వ్యక్తికి తెగిన చేతివేళ్లు
గంగవరం, ఆంధ్రప్రభ : అవసరాలకు డబ్బు అప్పిచ్చిన వ్యక్తి,వడ్డీ డబ్బులు ఇమ్మని అడిగినందుకు అప్పు తీసుకున్న వ్యక్తులు అతని ఇంటిపై దాడిచేశారు. అందుకు సంబంధించిన వివరాలిలా..మండలంలోని గంగవరం పంచాయతీ, చిన్నూరు గ్రామంలో వడ్డీ వ్యాపారి మహేష్ భూమిని తాకట్టు పెట్టుకుని అదే గ్రామానికి చెందిన మోక్షిత్ కు అప్పుఇచ్చాడు.
ఈ నేపథ్యంలో ఇచ్చిన అప్పుకు వడ్డీడబ్బులు ఇవ్వకుండా ఆలస్యం చేసినారని చరవాణిలో మోక్షిత్ ను మహేష్ గట్టిగా అడిగే క్రమంలో తీవ్రమైన వాదోపవాదాలు చోటుచేసుకున్నట్లు తెలిసింది.దీంతో కోపోద్రేకానికి గురైన మోక్షిత్ అతని సహోదరుడు హరిప్రసాద్ కలిసి అప్పిచ్చిన మహేష్ ఇంటిపై దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు.ఈ క్రమంలో తీవ్రంగా కోపానికి గురైన మహేష్ కత్తి తీసుకుని ఇద్దరు అన్నదమ్ములపై దాడికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో కత్తిని అడ్డుకోబోయిన మోక్షత్ కుడిచేతికి గాయమై మూడు వేళ్ళు తెగినట్లు తెలిసింది.
పరిస్థితిని గమనిస్తున్న స్థానికులు ఇరువురిని వారించి, గాయపడిన వ్యక్తిని పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా ఇరువురిని విచారించి తదుపరి చర్యలు తీసుకుంటామని గంగవరం సి.ఐ. రాంభూపాల్ తెలిపారు.
