ఎలక్ట్రిక్ బైక్‌లో మంటలు..

  • షార్ట్‌సర్క్యూట్‌తో రెండు బైక్‌లు దగ్ధం
  • పక్కనే ఉన్న గ్లామర్ బైక్‌కూ వ్యాపించిన అగ్ని
  • ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వ్యాపారుల్లో భయాందోళన
  • స్థానికుల అప్రమత్తతతో మంటలు అదుపు
  • రూ.1.50 లక్షల మేర ఆస్తినష్టం

గంపలగూడెం,ఆంధ్రప్రభ: ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం ఊటుకూరులో గురువారం జరిగిన అగ్నిప్రమాదంలో రెండు ద్విచక్ర వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. షార్ట్‌సర్క్యూట్ కారణంగా దుకాణం ముందు నిలిపి ఉంచిన ఎలక్ట్రిక్ బైక్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగి, పక్కనే ఉన్న మరో బైక్‌కు వ్యాపించడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.

తిరువూరు పట్టణానికి చెందిన హిందుస్థాన్ కంపెనీ సేల్స్‌మన్ డి. వెంకట్‌కు చెందిన ఎలక్ట్రిక్ బైక్‌లో షార్ట్‌సర్క్యూట్ ఏర్పడి మంటలు అంటుకున్నాయి. ఆ మంటలు సమీపంలో నిలిపి ఉంచిన దుకాణ యజమాని ఆచంట మురళికాంత్‌కు చెందిన గ్లామర్ బైక్‌కు వ్యాపించడంతో అది కూడా పూర్తిగా కాలి బూడిదైంది. ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడటంతో అక్కడి వ్యాపారులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న స్థానికులు, వ్యాపారులు కలిసి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించి మరింత వ్యాప్తి చెందకుండా అడ్డుకున్నారు.ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చింది. అయితే రెండు బైక్‌లు పూర్తిగా దగ్ధం కావడంతో సుమారు రూ.1.50 లక్షల మేర ఆస్తినష్టం సంభవించినట్లు ప్రాథమిక అంచనా. ఘటనకు సంబంధించి స్థానికులు వివరాలు సేకరిస్తున్నారు.