బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం..

గన్నవరం, ఆంధ్రప్రభ : భారత మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా కేసరపల్లి హరిజనవాడలో సోమవారం ఘనంగా నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ విప్‌, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్థానిక నాయకులతో కలిసి బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పుష్పమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ, భారత రాజకీయాల్లో బాబు జగ్జీవన్ రామ్ పాత్ర చిరస్మరణీయమని కొనియాడారు. వెనుకబడిన వర్గం నుంచి వచ్చి అనేక సామాజిక అడ్డంకులను అధిగమించి దేశ ఉప ప్రధానిగా ఎదిగిన ఆయన జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆనాటి రాజకీయ పరిస్థితుల కారణంగా ఆయన తన పూర్తి నాయకత్వ సామర్థ్యాన్ని చాటుకునే అవకాశం దక్కలేదని, లేకపోతే దేశ ప్రధానిగా సేవలందించే అవకాశం కూడా ఉండేదని పేర్కొన్నారు. చరిత్రలో ఆయనకు కొంత అన్యాయం జరిగినప్పటికీ, దేశానికి అందించిన సేవలు చిరకాలం గుర్తుండిపోతాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు అన్నే హరికృష్ణ, కోసూరి వెంకటేష్, నీలం అశోక్, గురిందపల్లి కోటేశ్వరరావు, మేడూరి సురేష్, జాస్తి రేణుక, అన్నే అంజిబాబు, సుధాబత్తుల రామకృష్ణ, జాస్తి వీరబాబు తదితరులు పాల్గొన్నారు.