అక్షర ఆంధ్రా – ఉల్లాస్ కార్యక్రమం విజయవంతం చేయాలి

అక్షర ఆంధ్రా – ఉల్లాస్ కార్యక్రమం విజయవంతం చేయాలి
జాయింట్ కలెక్టర్ పిలుపు
గుంటూరు, ఆంధ్రప్రభ: అక్షర ఆంధ్రా – ఉల్లాస్ కార్యక్రమం విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ పిలుపునిచ్చారు. అక్షర ఆంధ్రా ఉల్లాస్ కార్యక్రమంలో ఈ ఏడాది లక్ష్యం 77,501 గా ఉందని తెలిపారు. అక్షర ఆంధ్రా ఉల్లాస్ కార్యక్రమం పై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. 2026 – 27 సంవత్సరంలో ఉల్లాస్ అక్షర ఆంధ్రా కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతుందని అన్నారు. 2029 నాటికి రాష్ట్రంలోని వయోజనులను శత శాతం అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం ప్రభుత్వం ప్రధాన ఉద్దేశం అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది 25 లక్షల మందిని అక్షరాస్యులుగా చేయాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం తీసుకోవడం జరిగిందన్నారు. కార్యక్రమంలో భాగంగా వంద గంటల కరిక్యులం నిర్వహించడం జరుగుతుందని వివరించారు. ఇందులో ఆడియో విజువల్ కంటెంట్, తరగతి గదులు, ప్రాక్టీస్ చేయించడం జరుగుతుందన్నారు. తరగతులను సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు ప్రతిరోజు స్థానిక అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించుటకు చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఎప్పటిలాగానే ప్రాథమిక పాఠ్యాంశాలు, సాధన పత్రాలు పంపిణీ జరుగుతుందన్నారు. 48 రకాల డిజిటల్ వీడియోలను కూడా పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. ఫౌండేషన్ లెటర్స్ అండ్ న్యూమరసి కోర్స్ (ఎఫ్.ఎల్.ఎన్.సి)ను నైపుణ్యం పెంచడం లక్ష్యంగా చేపట్టడం జరుగుతుందన్నారు. 2026 సంవత్సరంలో నిర్వహించిన ఎఫ్.ఎల్.ఎన్.సి పరీక్షకు జిల్లా నుండి 92,387 మంది హాజరు కాగా 92,235 మంది ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు.
డ్వాక్రా సంఘాలు, శ్రామిక సంఘాలను ముఖ్యంగా ఇందులో భాగస్వామ్యం చేయడం జరుగుతుందని, డి.ఆర్.డి.ఏ, మెప్మా, ఎస్.జి.ఎస్.డబ్ల్యూ, పంచాయతీరాజ్ – గ్రామీణ అభివృద్ధి శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. జిల్లా, మండల, మున్సిపల్ స్థాయిలో కమిటీలను పర్యవేక్షణకు ఏర్పాటు చేయడం జరుగుతుందని,
ప్రతి ఇంట అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు.
2027 మార్చిలో గ్రామ స్థాయిలో అసెస్మెంట్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఈ ఏడాది జూలై 21 నుండి వచ్చే ఏడాది మార్చి 15వ తేదీ వరకు తరగతుల నిర్వహణ ఉంటుందని తెలిపారు. ఈ నెల 28 నుండి 30వ తేదీ వరకు అభ్యాసకులు, వాలంటీర్లను స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు సిబ్బంది ఎంపిక చేసి అక్షర ఆంధ్రా యాప్ లో నమోదు చేయాలని ఆదేశించారు. 30వ తేదీన జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. జూలై 1వ తేదీ నుండి 20వ తేదీ వరకు మున్సిపల్, మండల స్థాయిలలో శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. జూలై 21వ తేది నుండి 2027 మార్చి 15వ తేదీ వరకు తరగతులు జరుగుతాయని తెలిపారు. గత ఏడాది జిల్లాలో అక్షర ఆంధ్రా విజయవంతంగా నిర్వహించడం జరిగిందని, అదే స్పూర్తితో ఈ ఏడాది కూడా దిగ్విజయం చేయుటకు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసి పర్యవేక్షణ చేయడం జరుగుతుందని అన్నారు.
ఈ సమావేశంలో వయోజన విద్యా శాఖ ఉప సంచాలకులు కె.ఆంజనేయులు,
ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ పి ప్రసూన, సమాచార పౌర సంబంధాల శాఖ ఉప సంచాలకులు లోచర్ల రమేష్,
ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
