AP | జ‌గ‌న్‌లో కంగారు! బిగుసుకుంటున్న లిక్క‌ర్ స్కామ్‌

వ‌రుస‌గా అరెస్టు అవుతున్న అనుచ‌రులు
ద‌శావ‌తార లీడ‌ర్ల‌పై ముప్పేట దాడులు
అంట‌కాగిన‌ పోలీసు అధికారుల‌కు త‌ప్ప‌ని గోస‌
జ‌గ‌న్ జైలుకెళ్ల‌డం ఖాయ‌మ‌నే సూచ‌న‌లు
ముంద‌స్తుగా అడ్వొకేట్స్‌తో వ‌రుస భేటీలు
కేసు నుంచి బ‌య‌ట‌ప‌డేలా స‌మాలోచ‌న‌లు
ఏపీలో లిక్క‌ర్ స్కామ్ అంటే ఏమిటి?
4000 కోట్ల కుంభకోణం నిజమేనా
అందులో మాజీ సీఎం జ‌గ‌న్ పాత్ర ఏముంది
పొలిటిక‌ల్ స‌ర్కిళ్ల‌లో పెద్ద ఎత్తున చ‌ర్చ‌

సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ :

ఏపీలో ₹4000 కోట్ల మేరకు లిక్కర్ స్కామ్ జరిగిందని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇప్పటికే నలుగురు కీలక నిందితులను అరెస్టు చేసింది. ప్రస్తుతం పోలీసు కస్టడీలో నిందితుల నుంచి నిజాలు కక్కించే ప్రయత్నంలో దర్యాప్తు బృందం బిజీబిజీగా ఉంది. మరో వైపు విచారణకు ఈడీ సై అంది. ఢిల్లీ, మహారాష్ట్ర నుంచి మనీ ల్యాండరింగ్ జరిగినట్టు ఈడీ అనుమానిస్తోంది. ఈ స్థితిలో ఇటు ఏపీ పోలీసులు, అటు ఈడీకి ఏ చిన్న ఆధారం దొరికినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగిసినట్టే.. అనే అనుమానాలు తెరమీదకు రావటంతో జగన్​లో అంతర్గతంగా ఆందోళన ప్రారంభమైందని ఏపీలో ప్రచారం జరుగుతోంది.

సిట్ ఎంక్వైరీలో నిజాలు బయటికి..

లిక్కర్ కుంభకోణంలో వరుసగా జగన్ అండ్ కో టీమ్‌ని సిట్ అధికారులు అరెస్టు చేశారు. నలుగురు నిందితులను ప్రశ్నిస్తున్నారు. ఈ జాబితాలో మరో ఇద్దరు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు పోలీసు కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్న నలుగురూ లిక్కర్ లావాదేవీల్లో కీలక పాత్ర పోషించారని సిట్ అధికారులు నిర్ధారించారు. ముందస్తు బెయిల్‌పై న్యాయస్థానం కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. దీంతో ఈ కేసులో మరిన్ని అరెస్టులు తప్పవని భావిస్తున్నారు. పైనుంచి వచ్చిన ఆదేశాలను అమలు చేశామని ఆ నలుగురు నిందితులు సిట్ విచారణలో అంగీకరించినట్టు తెలుస్తోంది. అందులో ఒకరిద్దరు అప్రూవర్‌గా మారుతారని ప్రచారం జరుగుతోంది. లిక్కర్ కేసులో విచారణ పరిణామాలను తన వేగుల ద్వారా మాజీ సీఎం తెలుసుకున్నారనే ప్రచారం తెరమీదకు వచ్చింది. తమకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు వచ్చాయని నిందితులందరూ చెబుతున్నారట.

వకీళ్ల భేటీలో జగన్

ఈ పరిణామాల నేపథ్యంలో మాజీ సీఎం జగన్‌కు మరింత టెన్షన్ పెరిగినట్టు సమాచారం. ఢిల్లీ నుంచి సీనియర్ అడ్వకేట్లను బెంగుళూరుకి రప్పించుకుని వరుసగా భేటీలు నిర్వహించారని సమాచారం. ఈ కేసులో తాను అరెస్టు కాకుండా, కనీసం కోర్టు మెట్లు ఎక్కకుండా చూడాలని న్యాయవాదులకు చెప్పారట. ఒకవేళ అరెస్టయితే వెంటనే బెయిల్ వచ్చేలా చూడాలని చెప్పినట్టు సమాచారం. రెండురోజులుగా బెంగుళూరులో భారీ వర్షాలు పడుతున్నాయి. వర్షం దాటికి మునిగిన ప్రాంతాల్లో జగన్ యలహంక ప్యాలెస్ ఉందట. వర్షం వల్ల ఆ ప్యాలెస్ లో న్యాయవాదులు చిక్కుకున్నారని, ఆ తర్వాత బయటపడ్డారని తెలుస్తోంది. ఈ క్రమంలో న్యాయవాదుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

అక్ర‌మ ఆస్తుల కేసులు..

గడిచిన ఆరేళ్లు అక్రమ ఆస్తుల కేసులో మాజీ సీఎం జగన్ న్యాయస్థానికి వెళ్లలేదు ప్రభుత్వ కార్యక్రమాలు, రివ్యూ మీటింగులు అ కోర్టుకు చెప్పారు. ప్రస్తుతం ఏపీలో ఉంటే న్యాయస్థానానికి హాజరుకావాల్సిందే. అందుకే తాడేపల్లి నుంచి యలహంకకు తన మకాం మార్చేశారని కూటమి నేతలు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఏపీలో వైసీపీ అధికారం కోల్పోయి దాదాపు ఏడాది గడుస్తోంది. ఈ ఏడాదిలో ఒక్కసారి కూడా మాజీ సీఎం కోర్టు మెట్లు ఎక్కలేదు. పాస్‌పోర్టు విషయంలో న్యాయస్థానం అడ్డంకులు చెప్పడంతో చివరకు లండన్‌లో తన కుమార్తె బర్త్ డే వేడుకులకు జగన్ దూరంగా ఉన్న విషయం తెల్సిందే.

లిక్క‌ర్ స్కామ్‌లో కోర్ టీమ్‌..

లిక్కర్ కుంభకోణంలో జగన్ కోర్ టీమ్ మాత్రమే చిక్కుకుంది. ఈ విషయంలో వైసీపీ నేతలకు ఎలాంటి సంబంధం లేదు. కానీ ఆ నలుగురిలో ఏ ఒక్కరు లిక్కర్ స్కామ్ కు అప్రూవర్ గా మారితే.. మళ్లీ జైలుయాత్రకు మాజీ సీఎం సిద్ధం కావాల్సిందేనని కూటమి నేతలు గట్టిగా వాదిస్తున్నారు.

Leave a Reply