AP | స్టూడెంట్స్ కోసం..

AP | స్టూడెంట్స్ కోసం..
AP, మచిలీపట్నం, ఆంధ్రప్రభ : డిసెంబర్ 5వ తేదీన మెగా తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ( పేరెంట్, టీచర్స్) సమావేశం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని రాష్ట్ర విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి కోన శశిధర్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్ర విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర సచివాలయం నుండి మెగా తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం నిర్వహణ పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ… గతంలో మాదిరిగా కాకుండా ఈసారి విద్యార్థుల తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సమావేశం డిసెంబర్ 5వ తేదీన కేవలం ప్రభుత్వ విద్యాసంస్థల్లో మాత్రమే నిర్వహించాలన్నారు. అంతే కాకుండా ఈసారి ఉపాధ్యాయులకు కానీ.. విద్యార్థుల తల్లిదండ్రులకు కానీ ఎలాంటి పోటీలు నిర్వహించరాదన్నారు. ఈ సమావేశంలో స్థానిక ప్రజాప్రతినిధులను, విద్యార్థుల తల్లిదండ్రులను తప్పనిసరిగా భాగస్వామ్యం చేయాలన్నారు. ఈ సమావేశానికి వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులకు సంబంధిత విద్యార్థుల (Students) హోలీస్స్టిక్ కార్డులు, అసెస్మెంట్ పుస్తకాలు, బేస్ లైన్ పరీక్షల నివేదికలు అందజేసి వివరించాలన్నారు. విద్యార్థుల చదువు గురించి తల్లిదండ్రులకు తెలియజేసి వారి సహకారంతో విద్యార్థులు మరింత బాగా చదువుకునే విధంగా ప్రోత్సాహం అందించాలన్నారు. విద్యాసంస్థల్లో ఎక్కడా కూడా రాజకీయ నాయకుల ఫోటోలు కానీ.. బ్యానర్లు కానీ.. ఏర్పాటు చేయరాదని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా విద్యాసంస్థల్లోని గ్రంథాలయ పుస్తకాలను, క్రీడా పరికరాల వస్తువులను విద్యార్థుల తల్లిదండ్రులు చూసే విధంగా ప్రదర్శించాలన్నారు. అలాగే విద్యార్థులు తయారుచేసిన సైన్స్ ప్రాజెక్టులను కూడా ప్రదర్శించాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలను జిల్లా కలెక్టర్లు (Collector) సందర్శించినప్పుడు మధ్యాహ్న భోజనంతో పాటు విద్యార్థుల అసెస్మెంట్ పుస్తకాలను కూడా పరిశీలించి బాగా చదువుకునేందుకు తగు సూచనలు ఇవ్వాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా విద్యాధికారి కార్యాలయ పర్యవేక్షకులు పవన్ కుమార్, సమగ్ర శిక్ష కార్యాలయ సీఎంఓ రమేష్, జిల్లా ఇంటర్మీడియట్ అకాడమిక్ గైడెన్స్ మానిటరింగ్ సెల్ ఇన్చార్జి పి. నాగరవి పాల్గొన్నారు.
