సమస్యాత్మక గ్రామంలో పోలీసుల అవగాహన సదస్సు

సమస్యాత్మక గ్రామంలో పోలీసుల అవగాహన సదస్సు

నరసరావుపేట, ఆంధ్రప్రభ:
పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఆదేశాల మేరకు పోలీసు శాఖ తరఫున దుర్గి పోలీస్ స్టేషన్ పరిధిలోని సమస్యాత్మక గ్రామమైన జంగమేశ్వరపాడు నందు మాదక ద్రవ్యాల నిర్మూలన, రోడ్ సేఫ్టీ, సైబర్ క్రైమ్స్, మరియు మహిళల భద్రతపై సోమవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కారంపూడి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) పి. శరత్ బాబు మాట్లాడుతూ, గ్రామాలలో శాంతియుత వాతావరణాన్ని కాపాడటమే లక్ష్యంగా, అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలించేందుకు పోలీస్ విభాగం కట్టుబడి ఉందన్నారు. గ్రామ ప్రజలందరూ వివాదాలకు దూరంగా ఉండాలని, గొడవలు సృష్టించకూడదని సూచించారు. గ్రామంలో ఎవరైనా లా అండ్ ఆర్డర్ (శాంతిభద్రతల) సమస్యను సృష్టిస్తే వారిపై ఎస్పీ ఆదేశాల మేరకు చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామంలో ఏ చిన్న సమస్య ఉన్నా తక్షణమే పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరుతూ.. స్థానిక సమస్యల గురించి గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు.

మాదక ద్రవ్యాల వినియోగం వ్యక్తిగత ఆరోగ్యానికే కాకుండా కుటుంబాలకు, సమాజానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని, కాబట్టి ప్రతి ఒక్కరూ వాటికి దూరంగా ఉండాలని సీఐ పిలుపునిచ్చారు. ప్రస్తుత సమాజంలో 15 నుంచి 30 సంవత్సరాల వయస్సు గల యువత చాలా తేలికగా గంజాయి, డ్రగ్స్ వంటి వ్యసనాలకు అలవాటు పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల వారు మానసిక నియంత్రణ కోల్పోయి, తమ వ్యసనాలను తీర్చుకోవడానికి నేర ప్రవృత్తి వైపు మళ్లుతూ భвиష్యత్తును అంధకారం చేసుకుంటున్నారని తెలిపారు. కావున తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తన, నడవడికపై ప్రత్యేక శ్రద్ధ వహించి, వారు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించే విధంగా తీర్చిదిద్దాలని కోరారు.

మీ పరిసర ప్రాంతాలలో ఎవరైనా గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాలను వినియోగించినా, విక్రయించినా ఆ సమాచారాన్ని వెంటనే దగ్గరలోని పోలీసులకు గానీ లేదా 1972 టోల్ ఫ్రీ నెంబర్‌కు గానీ ఫోన్ చేసి తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు రహస్యంగా ఉంచబడతాయని సీఐ శరత్ బాబు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక దుర్గి పోలీస్ సిబ్బంది మరియు జంగమేశ్వరపాడు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply