దేశ మార్పుకు విద్యార్థి–యువతే శక్తి
యూనివర్సిటీల్లో విద్యార్థి సంఘాల ఎన్నికలు వెంటనే నిర్వహించాలి: సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ
కర్నూలు రూరల్ బ్యూరో, ఆంధ్రప్రభ: దేశంలో సామాజిక, రాజకీయ మార్పు రావాలంటే విద్యార్థులు, యువతే ప్రధాన శక్తిగా నిలవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ అన్నారు. నగర శివారులోని టీజీఆర్ ఫంక్షన్ హాలులో శుక్రవారం నిర్వహించిన ఏఐఎస్ఎఫ్ రాష్ట్రస్థాయి విద్యా–రాజకీయ శిక్షణా తరగతుల మూడో రోజు సమావేశంలో ఆయన ప్రసంగించారు. కార్యక్రమానికి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కుళ్లాయిస్వామి అధ్యక్షత వహించారు.
విద్యార్థులు, యువత సంకల్పిస్తే ప్రభుత్వాల మార్పు కూడా సాధ్యమేనని ఆయన పేర్కొన్నారు. శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్‌తో పాటు తమిళనాడులో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలను ఉదాహరణగా ప్రస్తావించారు.
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలని చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని, అదే సమయంలో యూనివర్సిటీలు, కళాశాలల్లో విద్యార్థి సంఘాల ఎన్నికలను వెంటనే నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ప్రస్తుతం డబ్బు ఉన్నవారికే ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు దక్కుతున్నాయని, ప్రజాసేవకు అంకితమైన వారికి అవకాశాలు తగ్గిపోతున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో పలువురు ప్రజాప్రతినిధులు ప్రజాసేవ కంటే సంపాదనే లక్ష్యంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై విమర్శలు చేస్తూ, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, దేశ ఆర్థిక పరిస్థితులపై తన అభిప్రాయాలను వెల్లడించారు.
యువత సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని, నూతన ఆలోచనలతో సమాజ మార్పుకు నాయకత్వం వహించాలని పిలుపునిచ్చారు. దేశానికి మేధావులను అందించడంలో ఏఐఎస్ఎఫ్ కీలక పాత్ర పోషించిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి బిడ్డయ్య, జిల్లా నాయకులు మునెప్ప, లెనిన్ బాబు, ఏఐవైఎఫ్ రాష్ట్ర నాయకులు సంతోష్ కుమార్, యుగంధర్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వరరాజు, రాష్ట్ర కార్యదర్శి బద్దెల నాసర్ జీతో పాటు పలువురు రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.
