అర్హులందరికీ ప్రవేశాలు కల్పించాలి
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై కలెక్టర్ ఆదేశాలు
కర్నూలు, ఆంధ్రప్రభ : ప్రభుత్వ సంక్షేమ పాఠశాలల్లో అర్హులైన ప్రతి విద్యార్థికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రవేశాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
శుక్రవారం కలెక్టరేట్లో గిరిజన సంక్షేమ, బీసీ, సాంఘిక సంక్షేమ, మైనార్టీ సంక్షేమ, గురుకుల విద్యాసంస్థలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్లలో విద్యార్థుల ప్రవేశాలు, సీట్ల భర్తీ, ఖాళీలు, అదనపు ప్రవేశాలపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
జిల్లాలోని అన్ని సంక్షేమ విద్యాసంస్థల్లో మంజూరైన సీట్లు, ప్రస్తుతం చదువుతున్న విద్యార్థుల సంఖ్య, ఖాళీలు, అదనంగా చేరిన విద్యార్థుల వివరాలను శాఖల వారీగా పరిశీలించారు. అధిక ప్రవేశాలు నమోదైన హాస్టళ్లు, తక్కువ ప్రవేశాలు ఉన్న హాస్టళ్ల పరిస్థితిని సమీక్షించి, అవసరమైన చోట సీట్ల సర్దుబాటు చేసి విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వచ్చే వారం నిర్వహించే సమీక్ష నాటికి ఖాళీల భర్తీ ప్రక్రియలో గణనీయమైన పురోగతి కనిపించాలని అధికారులకు స్పష్టం చేశారు. శాఖల మధ్య సమన్వయం పెంచుకుని మిగిలిన ప్రవేశాలను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
విద్యార్థులకు నాణ్యమైన వాతావరణం కల్పించేందుకు అదనపు మరుగుదొడ్లు, పారిశుద్ధ్య పనులు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధి పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ విద్యాసంస్థలను ఆదర్శంగా తీర్చిదిద్దే దిశగా నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తూ పనులు చేపట్టాలని సూచించారు.
ప్రభుత్వం విద్యార్థుల కోసం కల్పిస్తున్న వసతులు, చేపట్టిన మరమ్మతులు, కొత్తగా ఏర్పాటు చేసిన సౌకర్యాలపై తల్లిదండ్రులకు స్పష్టమైన అవగాహన కల్పించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలపై ప్రజల్లో సానుకూల అభిప్రాయం పెరిగేలా అధికారులు క్షేత్రస్థాయిలో ప్రచారం చేపట్టాలని, పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
సమావేశంలో సర్వశిక్ష అభియాన్ పీఓ లోకరాజ్, బీసీ సంక్షేమ అధికారి ప్రసూన, సాంఘిక సంక్షేమ అధికారి రాధిక, గిరిజన సంక్షేమ అధికారి సురేష్, మైనార్టీ సంక్షేమ అధికారి సబిహా పర్వీన్ తదితరులు పాల్గొన్నారు.
