పుట్టపర్తిలో ఏఎంసీఏ ప్రాజెక్టు
పుట్టపర్తిలో ఏఎంసీఏ ప్రాజెక్టు
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలో సువర్ణ అధ్యాయం – ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్
అమరావతి, ఆంధ్రప్రభ: పుట్టపర్తిలో అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఏఎంసీఏ) ప్రాజెక్టుకు శంకుస్థాపన జరగడం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మార్చే చారిత్రాత్మక ఘట్టమని పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పేర్కొన్నారు.
శుక్రవారం నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, గతంలో పరిశ్రమలు రాష్ట్రాన్ని దాటిపోయే పరిస్థితి ఉండేదని, కానీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఇప్పుడు ప్రపంచ స్థాయి పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ వైపు వస్తున్నాయని తెలిపారు.
కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పాల్గొని ఏఎంసీఏ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం రాష్ట్ర ప్రతిష్టను జాతీయ స్థాయిలో మరింత పెంచిందని ఆయన అభిప్రాయపడ్డారు.
“నమో-నాయుడు” సమన్వయం వల్లే రాష్ట్రానికి భారీ పెట్టుబడులు, జాతీయ ప్రాజెక్టులు వరుసగా వస్తున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సహకారం, సీఎం చంద్రబాబు దూరదర్శి నాయకత్వం కలసి ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా నిలబెడుతున్నాయని అన్నారు.
గూగుల్ డేటా సెంటర్‌కు రూ.1.35 లక్షల కోట్లు, ఆర్సెలార్ మిట్టల్ నుండి భారీ పెట్టుబడులు రావడం, ఇప్పుడు లక్షల కోట్ల విలువైన ఫైటర్ జెట్స్ తయారీ ప్రాజెక్టు రాష్ట్రానికి దక్కడం చంద్రబాబు పరిపాలనా సామర్థ్యానికి నిదర్శనమని చెప్పారు.
గత వైసీపీ ప్రభుత్వంలో పరిశ్రమలు పారిపోయే పరిస్థితి ఉండగా, కూటమి ప్రభుత్వంలో పెట్టుబడులు పరుగెత్తుతూ వస్తున్నాయని భాష్యం ప్రవీణ్ విమర్శించారు. ఐదేళ్ల విధ్వంసం తర్వాత రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం కొత్త దిశ, ఆశ చూపుతోందని తెలిపారు.
అమరావతి నిర్మాణానికి కేంద్ర నిధులు, పోలవరం ప్రాజెక్టుకు వేగవంతమైన సహకారం, విశాఖ ఉక్కు పరిరక్షణ, విశాఖ రైల్వే జోన్ సాధన, కర్నూలుకు హైకోర్టు బెంచ్ ఏర్పాటు వంటి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని చెప్పారు.
కేవలం 36 రోజుల్లో ఏఎంసీఏ ప్రాజెక్టును రాష్ట్రానికి తీసుకురావడం సాధారణం కాదని, ఇది సీఎం చంద్రబాబు “జెట్ స్పీడ్ పాలన”కు ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొన్నారు. ఏప్రిల్ 9న ప్రారంభమైన చర్చలు మే 15న శంకుస్థాపన దశకు చేరుకోవడం వెనుక రాష్ట్ర ప్రభుత్వ చురుకుదనం, పారదర్శకత, పారిశ్రామిక అనుకూల విధానాలు ప్రధాన కారణమని తెలిపారు.
ఈ ప్రాజెక్ట్ ద్వారా వేలాది యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, రాయలసీమతో పాటు మొత్తం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి లభిస్తుందని ఆయన తెలిపారు. చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ దేశ రక్షణ రంగంలో కీలక శక్తిగా ఎదుగుతోందని భాష్యం ప్రవీణ్ అన్నారు.
