దుర్గగుడి ప్రమాద ఘటన.. దేవినేని అవినాష్ ఆగ్రహం

దుర్గగుడి ప్రమాద ఘటన.. దేవినేని అవినాష్ ఆగ్రహం
విజయవాడ, ఆంధ్రప్రభ: గుంటూరు నుంచి అమ్మవారి దర్శనానికి వచ్చిన కుటుంబం దుర్గమ్మ దేవస్థానంలో మెట్ల పూజ నిర్వహిస్తున్న సమయంలో ప్రమాదానికి గురై, చిన్నారి పద్మావతి తలకు తీవ్ర గాయాలు అయ్యాయి.
ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవస్థాన నిర్వహణలో ఉన్న నిర్లక్ష్యం ఈ ఘటనకు కారణమని, భక్తుల ప్రాణ భద్రతకు కనీస జాగ్రత్తలు కూడా తీసుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రమాద సమయంలో దేవస్థాన మెడికల్ ఆఫీసర్ అందుబాటులో లేకపోవడం మరింత దారుణమని ఆయన పేర్కొన్నారు. ప్రతిరోజూ వేలాది మంది భక్తులు వస్తే, అత్యవసర వైద్య సదుపాయాలు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి అని ఆయన అన్నారు.
ఇటీవల దుర్గగుడిలో వరుసగా ప్రమాదాలు చోటుచేసుకోవడం భక్తుల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాయని, అయినప్పటికీ అధికారులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం బాధ్యతారాహిత్యం అని ఆయన విమర్శించారు.
దేవినేని అవినాష్, ప్రభుత్వం , దేవస్థానం అధికారులను మెట్లు, మండపాలు, శ్లాబులు, భవనాలపై సాంకేతిక తనిఖీలు నిర్వహించి భక్తులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
గాయపడిన చిన్నారి పద్మావతి త్వరగా కోలుకోవాలని, కుటుంబానికి వైద్య సాయం మరియు పూర్తి సహాయం అందించాలని ఆయన కోరారు.
