వెలగపూడి | డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కృషి ఫలించబోతోంది.. రాష్ట్రంలో పంటపొలాల్ని నాశనం చేస్తున్న అడవి ఏనుగులను నియంత్రించేందుకు, ఊళ్లపై పడి ప్రజలను భయాందోళనకు గురిచేస్తూ.. ఎంతో మంది రైతుల, ప్రజల ప్రాణాలు తీసిన ఏనుగులను కట్టడి చేసేందుకు కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరిపారు పవన్ కల్యాణ్.. అడవి ఏనుగులను కట్టడి చేయడానికి కుంకీ ఏనుగుల కోసం చర్చించి ఒప్పించారు..
ఇక, ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌కు ఆరు కుంకీ ఏనుగులను అందించబోతోంది కర్ణాటక ప్రభుత్వం.. అందులో భాగంగా నేడు బెంగళూరు వెళ్లనున్నారు డిప్యూటీ సీఎం, అటవీ, పర్యావరణశాఖ మంత్రి పవన్ కల్యాణ్.. కుంకీ ఏనుగులను ఏపీకి రప్పించే కార్యక్రమానికి హాజరుకానున్నారు..
అడవి ఏనుగుల దాడులతో రైతుల పంటలకు, గ్రామీణ జనాభాకు కలుగుతున్న నష్టాన్ని నివారించడానికి కూటమి ప్రభుత్వం ముందడుగు వేసింది… శిక్షణ పొందిన కుంకీ ఏనుగులను అధికారికంగా ఈ రోజు ఏపీకి అప్పగించనుంది కర్ణాటక ప్రభుత్వం.
బెంగళూరులో నేడు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో కుంకీ ఏనుగులను అప్పగించనున్నట్టు ఇప్పటికే కర్ణాటక అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే తెలిపారు..
తమకు కుంకీ ఏనుగులు కావాలని గతేడాది ఆగస్టు 8వ తేదీన పవన్ కల్యాణ్ కోరారు. ఇక, సెప్టెంబరు 27న విజయవాడకు తాను
వెళ్లిన సమయంలో ఏనుగుల అప్పగింతకు ఒప్పందం కుదిరినట్టు వెల్లడించారు.. అందుకు అనుగుణంగా కుంకీ ఏనుగులను ఏపీకి అందించబోతున్నాం. ఏపీ నుంచి కర్ణాటకలోకి ఏనుగులు రాకుండా అక్కడి ప్రభుత్వమే చర్యలు తీసుకుంటుందన్నారు మంత్రి ఈశ్వర్ ఖండ్రే..