క్లిష్ట శస్త్రచికిత్సతో యువకుడికి కొత్త జీవితం

క్లిష్ట శస్త్రచికిత్సతో యువకుడికి కొత్త జీవితం
- రాయలసీమలో తొలిసారి మూడు ధమనుల కిడ్నీ మార్పిడి విజయవంతం
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ: రాయలసీమలో తొలిసారిగా మూడు ధమనులు కలిగిన క్లిష్ట కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను మెడికవర్ హాస్పిటల్స్ కర్నూలు వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్‌కు చెందిన 23 ఏళ్ల యువకుడికి ఈ శస్త్రచికిత్స చేసి కొత్త జీవితం ప్రసాదించారు. గత 2–3 సంవత్సరాలుగా కిడ్నీ వైఫల్యంతో బాధపడుతున్న యువకుడు, గత 8 నెలలుగా డయాలిసిస్‌పై ఆధారపడి జీవనం సాగిస్తున్నాడు. కిడ్నీ మార్పిడి కోసం హైదరాబాద్‌లోని పలు ప్రముఖ ఆసుపత్రులను సంప్రదించినప్పటికీ, దాత కిడ్నీలో మూడు ధమనులు ఉండటం వల్ల కేసు అత్యంత క్లిష్టంగా మారి, అక్కడి వైద్యులు శస్త్రచికిత్సకు ముందుకు రాలేదు.
ఈ నేపథ్యంలో రోగి మెడికవర్ హాస్పిటల్స్ కర్నూలును ఆశ్రయించగా, ఇక్కడి నిపుణులైన కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ బృందం ఈ కేసును సవాల్‌గా స్వీకరించింది. రోగి తల్లి తన కుమారుడి ప్రాణాలను కాపాడేందుకు కిడ్నీ దానం చేయడం హృదయాన్ని కదిలించే ఘటనగా నిలిచింది. అన్ని వైద్య పరీక్షలు పూర్తి చేసిన అనంతరం శస్త్రచికిత్సను ప్రారంభించిన వైద్యులు, మూడు ధమనులు ఉన్న కిడ్నీ కారణంగా ఎదురైన సాంకేతిక సవాళ్లను అధిగమించి అత్యంత నైపుణ్యంతో ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. మెడికవర్ హాస్పిటల్స్ కర్నూలులో ఇది 7వ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సగా ప్రత్యేక గుర్తింపు పొందింది.
ఈ శస్త్రచికిత్సలో యూరాలజిస్ట్ డా. ఎస్. అబ్దుల్ సమద్, నెఫ్రాలజిస్ట్ డా. సిద్ధార్థ్ హెరూర్ కీలక పాత్ర పోషించారు. అనస్తీషియా సేవలను డా. బాల ప్రవీణ్ కుమార్, డా. డి. రేష్మ సమర్థంగా నిర్వహించగా, ఓటీ బృందం పూర్తి సహకారం అందించింది. ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ కర్నూలు హెడ్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, “ఇలాంటి క్లిష్టమైన కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించడం మా వైద్య బృందం నైపుణ్యానికి నిదర్శనం. తల్లి తన కుమారుడి కోసం చేసిన అవయవ దానం అత్యంత గొప్పది. మా ఆసుపత్రిలో ఆధునిక సదుపాయాలు, అనుభవజ్ఞులైన నిపుణులతో అత్యుత్తమ అవయవ మార్పిడి సేవలు అందిస్తున్నాం” అని తెలిపారు.
ఈ విజయవంతమైన శస్త్రచికిత్స రాయలసీమ వైద్య రంగానికి మరో మైలురాయిగా నిలిచింది.
