జగ్గయ్యపేట ఈద్గాలో రంజాన్ వేడుకలు…
జగ్గయ్యపేట ఈద్గాలో రంజాన్ వేడుకలు…
నెట్టెం రఘురామ్‌తో కలిసి ప్రార్థనలు చేసిన ప్రజాప్రతినిధులు ఆధ్యాత్మికత, సోదరభావంపై ప్రార్ధనలు.
రూ 24 లక్షల కాంపౌండ్ వాల్ ప్రారంభం
జగ్గయ్యపేట, ఆంధ్రప్రభ : రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని జగ్గయ్యపేట పట్టణంలోని బలుసుపాడు రోడ్డులో గల ఈద్గాలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలు సామరస్యానికి, సౌహార్దానికి ప్రతీకగా నిలిచాయి. ఈ పవిత్ర సందర్భంలో మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం శ్రీ రఘురామ్ ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు నిర్వహించి వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట శాసనసభ్యుడు శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య), మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర పాల్గొన్నారు.ముస్లిం పెద్దలు, మత గురువులు, యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా నెట్టెం రఘురామ్ మాట్లాడుతూ రంజాన్ పండుగ కేవలం ఆచారాలకు పరిమితం కాకుండా ఆత్మపరిశీలన, ఆత్మశుద్ధికి దారితీసే ఆధ్యాత్మిక యాత్రగా అభివర్ణించారు.
ఉపవాసం ద్వారా మనసును నియంత్రించడం, కష్టాలను సహించడం ద్వారా సహనం పెంపొందించడం, అవసరంలో ఉన్నవారికి చేయూత అందించడం వంటి విలువలు రంజాన్ సందేశంలో కీలకమని పేర్కొన్నారు. రాష్ట్రంలో సామరస్య వాతావరణం బలోపేతం కావాలంటే ప్రతి ఒక్కరూ పరస్పర గౌరవం, ఐక్యతను పాటించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. అన్ని వర్గాలను సమానంగా గౌరవించే విధానమే సమాజ అభివృద్ధికి బలమైన పునాదిగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యుడు శ్రీరామ్ రాజగోపాల్, నెట్టెం రఘురామ్ కలిసి రూ.24 లక్షల వ్యయంతో నిర్మించిన ఈద్గా కాంపౌండ్ వాల్‌ను ప్రారంభించారు.
