నాగర్‌కర్నూల్ జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ విజయవంతం
బాలల భవిష్యత్తుకు అండగా పోలీసు, అధికార యంత్రాంగం
బాల్యాన్ని బంధించిన సంకెళ్లు తెంచిన ముస్కాన్
…. జిల్లా వ్యాప్తంగా 60 మంది బాలలకు స్వేచ్ఛ
అచ్చంపేట ఆంధ్రప్రభ : చిన్నారుల బాల్యాన్ని కాపాడుతూ, వారికి విద్యా భవిష్యత్తును అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ ముస్కాన్’ నాగర్‌కర్నూల్ జిల్లాలో విశేష ఫలితాలను సాధించింది. జూలై 1 నుంచి 31 వరకు నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో జిల్లా వ్యాప్తంగా 60 మంది బాల కార్మికులను గుర్తించి విముక్తి కల్పించారు. వారిని రక్షించడమే కాకుండా విద్య, పునరావాసం, ఉపాధి దిశగా అడుగులు వేయడం ద్వారా ఆపరేషన్ ముస్కాన్ తన లక్ష్యాన్ని సార్థకం చేసుకుంది.
నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్, జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ల నిరంతర పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించారు. ముగ్గురు ఎస్సైలు, ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లు, తొమ్మిది మంది పోలీసు సిబ్బంది, నలుగురు చైల్డ్ వెల్ఫేర్ అధికారులు, విద్య, వైద్య, కార్మిక శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీవోలు సమన్వయంతో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నాగర్‌కర్నూల్-కొల్లాపూర్, కల్వకుర్తి, అచ్చంపేట డివిజన్లలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
బస్స్టాండ్లు, హోటళ్లు, ఢాబాలు, పరిశ్రమలు, వర్క్‌షాపులు, వాణిజ్య సంస్థలు, మార్కెట్ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి బాల కార్మికులుగా పనిచేస్తున్న చిన్నారులను గుర్తించి రక్షించారు. 14 సంవత్సరాల లోపు పిల్లలను పనిలో పెట్టుకున్న యజమానులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయగా, 14 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలలను పనిలో పెట్టుకున్న వారిపై చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. బాధిత బాలలకు చట్టప్రకారం నష్టపరిహారం అందించే చర్యలు చేపట్టారు.

అచ్చంపేటలో పోలీస్ ఎస్ఐ ఇందిర టీం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో ఒక్క జూలై మాసంలోనే 16 మంది బాలురను బాల కార్మికత్వం నుంచి విముక్తి చేసి సురక్షితంగా రక్షించడం విశేషంగా నిలిచింది. అనంతరం వారిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించి, కుటుంబ పరిస్థితులను పరిశీలించి పునరావాస ప్రక్రియ ప్రారంభించారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో, గురుకులాలలో చేర్పించడం, వసతి అవసరమైన వారికి ప్రభుత్వ హాస్టళ్లలో సౌకర్యం కల్పించడం, పదో తరగతి పూర్తి చేసిన వారికి వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించి ఉపాధి అవకాశాలు కల్పించే చర్యలు చేపడుతున్నారు.
ఆపరేషన్ ముస్కాన్ ద్వారా నాగర్ కర్నూల్ జిల్లాలో జూలై 1 నుండి 31 వరకు జరిపిన తనిఖీలలో 40 మంది బాలురు, 18 మంది బాలికలు మొత్తం 60 మంది బాల బాలికలకు స్వేచ్ఛ లభించడం పట్ల స్థానికులు, ప్రజాప్రతినిధులు పోలీసు శాఖ, జిల్లా యంత్రాంగం, సంబంధిత శాఖల అధికారులను అభినందించారు. బాలల హక్కుల పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తున్న ఆపరేషన్ ముస్కాన్ బృందం సమాజానికి ఆదర్శంగా నిలుస్తోందని కొనియాడారు.


పారాతట్ట వద్దు – పుస్తకాలే ముద్దు
పోలీస్ ఎస్ఐ ఇందిర
చిన్నారుల చేతుల్లో పనిముట్లు కాదు… పుస్తకాలే ఉండాలి. బాల్యాన్ని పనుల్లో బంధించకుండా పాఠశాలల్లోకి పంపించడం ప్రతి తల్లిదండ్రి, ప్రతి యజమాని, ప్రతి పౌరుడి బాధ్యత. బాల కార్మికత్వం కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి.
ప్రతి చిన్నారి చిరునవ్వే మా ఆపరేషన్ ముస్కాన్ విజయానికి అసలైన అర్థం.
