కుంభకోణంలో మరో నిందితుడు అరెస్ట్….!
కుంభకోణంలో మరో నిందితుడు అరెస్ట్….!
సీఐ ఫిరోజ్ వెల్లడి.
పల్నాడు ప్రతినిధి, ఆంధ్రప్రభ : పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో నకిలీ మహిళా స్వయం సహాయక సంఘాల పేరుతో బ్యాంకు రుణాల మోసానికి సంబంధించిన కేసులో పోలీసులు మూడో నిందితుడు షేక్ ఉమర్ వలిని అరెస్ట్ చేశారు. ఇండియన్ బ్యాంక్, ఎస్బిఐ, ఎడిబి, జి డి సి సి బ్యాంకు పిడుగురాళ్ల లో మహిళా సంఘాల పేరుతో నకిలీ ఎస్ హెచ్ జి గ్రూపులు సృష్టించి భారీ రుణాలు మంజూరు చేయించినట్లు విచారణలో బయటపడింది. మొత్తం 81 నకిలీ సంఘాల పేరుతో సుమారు రూ.9.59 కోట్లు రుణాలు మంజూరు చేయించబడినట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసులో ఏ-3 అయిన షేక్ ఉమర్ వలి 11 నకిలీ సంఘాల ద్వారా సుమారు రూ.1.24 కోట్లు రుణాలు మంజూరు అయ్యేలా సహకరించినట్లు పోలీసులు తెలిపారు.
నిందితుడిని ఈ నెల 15వ తేదీన హైదరాబాద్ లో అదుపులోకి తీసుకుని నరసరావుపేటకు తీసుకువచ్చి అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఏ-5 ఇప్పటికే అరెస్టు కాగా, మిగిలిన నిందితులు పరారీలో ఉండగా వారిని పట్టుకునేందుకు చర్యలు కొనసాగుతున్నాయని నరసరావుపేట వన్ టౌన్ సిఐ షేక్ డి ఫిరోజ్ తెలిపారు. నిందితుడు షేక్ ఉమర్ వలిని కోర్టులో హాజరుపరచగా కోర్టు వారు 15 రోజుల రిమాండ్ కు పంపినట్లు సీఐ చెప్పారు. ఇదిలా ఉండగా జిల్లా మెప్మా శాఖలో జరిగిన కుంభకోణంపై నరసరావుపేట వన్ టౌన్ పిఎస్ లో గత నెల 12వ తేదీన కేసు నమోదు చేశారు.
జిల్లా అర్బన్ సమాఖ్య అధ్యక్షురాలు షేక్ అఖిల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ ఫిరోజ్ తెలిపారు. నకిలీ గ్రూపులు సృష్టించి సుమారు 10 కోట్ల రూపాయల నిధులను గోల్ మాల్ చేసినట్లు అఖిల తన ఫిర్యాదు లో పేర్కొన్నారు. ఈ నిధులు పక్కదారి పట్టడానికి మెప్మా శాఖ లోని ఎనిమిది మంది అధికారులు సహకరించినట్లు గుర్తించారు. దీంతో మెప్మా శాఖలో కీలక ఉద్యోగుల సస్పెన్షన్ తో పాటు కమ్యూనిటీ ఆర్గనైజర్లు 8 మందిపై కేసు నమోదు కావడంతో స్కామ్ సూత్రధారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని చెప్పకనే తెలుస్తోంది.
