చిన్నారుల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట..

అంగన్‌వాడీల్లో మెరుగైన సేవలు అందించాలి

పౌష్టికాహారం, ప్రీ-ప్రైమరీ విద్యతో చిన్నారుల భవిష్యత్‌కు బాటలు వేస్తున్నాం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

జగిత్యాల జిల్లా బుగ్గారం, ఆంధ్రప్రభ : చిన్నారుల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

మంగళవారం జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం యశ్వంత్‌రావుపేట గ్రామంలో ఉపాధి హామీ పథకం నిధులు రూ.12 లక్షలతో నూతనంగా నిర్మించిన అంగన్‌వాడీ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం చిన్నారులకు పౌష్టికాహారంతో పాటు ప్రీ-ప్రైమరీ విద్యను అందిస్తోందని తెలిపారు. బాలింతలు, గర్భిణీల ఆరోగ్య పరిరక్షణ విషయంలో కూడా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని వివరించారు.

అంగన్‌వాడీ సేవలను ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బంది మరింత అంకితభావంతో పని చేస్తూ లబ్ధిదారులకు నాణ్యమైన సేవలు అందించాలని కోరారు. ప్రభుత్వ లక్ష్యాలను విజయవంతం చేయడంలో అంగన్‌వాడీ కార్యకర్తల పాత్ర ఎంతో కీలకమని మంత్రి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉరుమట్ల లక్ష్మీ బుచ్చయ్య, మాజీ జెడ్పీటీసీ బాధినేని రాజేందర్, బుగ్గారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సర్సాగౌడ్లు తదితరులు పాల్గొన్నారు.