Anganwadi | అంగన్వాడి కేంద్రానికి గ్రహణం

Anganwadi | అంగన్వాడి కేంద్రానికి గ్రహణం
- 15 రోజులుగా కేంద్రానికి తాళం
- సామాగ్రి కుళ్ళి పోవడంతో దుర్వాసన వస్తున్న వైనం
- బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు నిలిచిపోయిన పౌష్టికాహారం
- ఇంచార్జ్ కేంద్రం నిర్వహకురాలి డుమ్మాతో కేంద్రానికి తాళం
- పరిస్థితి చక్కదిద్దాలని గ్రామస్థుల విన్నపం
- సంబంధిత అధికారులు చొరవ చూపాలని డిమాండ్
Anganwadi | ఎడపల్లి, ఆంధ్రప్రభ : ఎడపల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో గల అంగన్వాడి కేంద్రం గత 15 రోజులుగా తాళం వేసి ఉండడం మూలంగా తమ గ్రామానికి చెందిన బాలింతలకు, పిల్లలకు పౌష్టికాహారం అందడం లేదని బ్రాహ్మణపల్లి(Brahmanapalli) గ్రామస్తులు తమ ఆవేదన వ్యక్తం చేశారు.
గత 15 రోజుల నుండి అంగన్వాడీ కేంద్రాని(Anganwadi Centre)కి తాళం వేసి ఉండడంతో తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడంలేదని గ్రామస్తులు వాపోయారు. తమ గ్రామ అంగన్వాడీ కేంద్రానికి చెందిన ఉపాధ్యాయులకి గ్రామ నిధుల నుండి వేతనం అందించే వారమని, సదరు ఉపాధ్యాయురాలికి వేతనం అందకపోగా విధులకు హాజరు కావడం మానివేయడం జరిగిందన్నారు.
ఏ ఆర్ పి క్యాంప్ గ్రామానికి చెందిన అంగన్వాడి కేంద్రం టీచర్ కు తమ గ్రామ అంగన్వాడీ కేంద్రం నిర్వహణ బాధ్యతలు సంబంధిత అధికారులు(Officials) అప్పగించారన్నారు. కానీ ఆమె సైతం గత 15 రోజులుగా అంగన్వాడి కేంద్రానికి రాకపోవడంతో కేంద్రానికి తాళం వేసి ఉంటుందని తద్వారా తమ గ్రామ బాలింతలకు, చిన్నారులకు పౌష్టికాహారం అందడం లేదని గ్రామస్తులు తెలిపారు. సంబంధిత అధికారులు వెంటనే చొరవ చూపి తమ గ్రామ అంగన్వాడీ కేంద్రంలో కొనసాగుతున్న సమస్యను వెంటనే పరిష్కరించి తమ గ్రామ ప్రజలకు పౌష్టికారం అందే విధంగా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.
