Andhra Pradesh Investments | 23 నెలల్లో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు

Andhra Pradesh Investments | 23 నెలల్లో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు

Andhra Pradesh Investments | నెలకు లక్ష కోట్ల పెట్టుబడుల లక్ష్యంతో ప్రభుత్వం
24 లక్షల ఉద్యోగ అవకాశాల దిశగా అడుగులు
ఈజ్ ఆఫ్ డూయింగ్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ వైపు
సెక్టార్ల వారీగా అభివృద్ధి వికేంద్రీకరణ
రిలయన్స్ సహా భారీ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్

Andhra Pradesh Investments | అమరావతి, ఆంధ్రప్రభ : భారతదేశంలోనే అత్యధిక పెట్టుబడులకు గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుంది. ప్రభుత్వ పెట్టుబడుల విధానంలో తీసుకువచ్చిన మార్పులతో లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి వచ్చాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 23 నెలల్లో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అంటే నెలకు రూ. లక్ష కోట్ల పెట్టుబడులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆకర్షించి దేశంలోనే అత్యధిక పెట్టుబడులు సాధించిన రాష్ట్రంగా నిలిచింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఇమేజ్తో మంత్రి నారా లోకేష్ పెట్టుబడుల వేటను కొనసాగిస్తూ అద్వితీయ విజయాలు అందుకుంటున్నారు.

గూగుల్ వంటి విశ్వవిఖ్యాత కంపెనీని రాష్ట్రానికి తీసుకువచ్చారు. అలాగే మిట్టల్ స్టీల్ ప్లాంట్ను తీసుకువచ్చి వేలాదిమంది నిరుద్యోగ యువతలో కొత్త జీవాన్ని నింపారు. యువగళం పాదయాత్రలో యువనేత లోకేష్ యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పన వంటి స్పష్టమైన హామీ ఇవ్వడమే కాకుండా మానిఫెస్టోలో సైతం పెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంత్రి లోకేష్ ఆ హామీని నెరవేర్చే పనిలో నిమగ్నమయ్యారు. దేశ, విదేశాలకు చెందిన దిగ్గజ సంస్థలు, కంపెనీలను రాష్ట్రానికి తీసుకువచ్చి 20 లక్షల ఉద్యోగాల లక్ష్యసాధనను ఇప్పటికే అధిగమించారు. వాస్తవంగా ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకు లోకేష్ హామీ ఇచ్చారు. అయితే 23 నెలల్లోనే ఈ లక్ష్యాన్ని అధిగమించి తన చిత్తశుద్ధిని యువనేత నిరూపించుకున్నారు. రాష్ట్రానికి 23 నెలల్లో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టడం ద్వారా 24 లక్షల ఉద్యోగాల కల్పనకు ఆయన బాటను వేశారు.

ఈజ్ ఆఫ్ డూయింగ్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్కి..

రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం అందుకు అనుగుణంగా పటిష్టమైన చర్యలు చేపట్టింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగికి పారిశ్రామిక విధానాలను మార్చి పెట్టుబడులను ఆకర్షించడంలో నెంబర్ వన్గా నిలిచింది. ఎంవోయూలతో పనిలేకుండానే కొత్త పరిశ్రమలకు సత్వర అనుమతులు మంజూరు చేస్తూ మూడు నుంచి ఆరు నెలలోపే గ్రౌండ్ అయ్యేలా చర్యలు తీసుకుంటోంది. కేవలం 15 రోజుల్లోనే అనుమతులు మంజూరు చేస్తూ పారిశ్రామిక వేత్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. అంతేకాకుండా ప్రభుత్వ పరంగా ఇచ్చే రాయితీలు, భూముల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేస్తోంది. ఏపీ ప్రభుత్వం అవలంభిస్తున్న పారిశ్రామిక విధానాలు పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయి. దీంతో దేశంలోనే 25.3 శాతం పెట్టుబడులను ఆకర్షించే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది.

ప్రాంతాలు… సెక్టార్ల వారీగా పెట్టుబడులు

అభివృద్ధి వికేంద్రీకరణే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుంది. అభివృద్ధి ఒకే ప్రాంతానికి పరిమితం కాకుండా దాన్ని వికేంద్రీకరణ చేస్తూ ప్రాంతాలు, సెక్టార్ల వారీగా పెట్టుబడులను వికేంద్రీకరిస్తుంది. ఉత్తరాంధ్రలో ఐటీ, ఫార్మా, ఇతర రంగాలకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి చేస్తోంది. ఇక రాయలసీమను ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ హబ్‌గా తీర్చిదిద్దుతుంది.

కోస్తా ప్రాంతానికి క్వాంటం వ్యాలీతో పాటు ప్రపంచ ప్రఖ్యాత విద్యా సంస్థలు, ఇతర రంగాల పెట్టుబడులను కేటాయిస్తూ అభివృద్ధి వికేంద్రీకరణకు కృషి చేస్తోంది. అలాగే రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులను నెలకొల్పడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎంఎస్ఎంఈల ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

విశాఖ సీఐఐ సదస్సులో రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒకే వేదికపై లక్షల కోట్ల పెట్టుబడులను సాధించింది. విశాఖ వేదికగా జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు చేసుకుంది. వీటిలో సగానికి పైగా పెట్టుబడులు ఇప్పటికే కార్యరూపం దాల్చాయి. ఇక తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఒకేసారి రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం కొనసాగుతోంది.

ఈ నెలలో మరో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు..!

ఇదిలా ఉండగా ఈనెలాఖరులోగా లేదా జూన్ మొదటి వారంలో మరో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కృషి చేస్తున్నారు. రిలయన్స్ సంస్థ రూ.లక్షన్నర కోట్ల పెట్టుబడులను రాష్ట్రంలో పెట్టనుంది. క్లీన్ ఎనర్జీ రంగానికి సంబంధించి ఈ పెట్టుబడి రాష్ట్రానికి రానుంది. దీంతో కూటమి ప్రభుత్వం 24 నెలల పాలనలో రూ.24 లక్షల కోట్ల పెట్టుబడులను సాధించిన రాష్ట్రంగా చరిత్ర సృష్టించనుంది.

Leave a Reply