ADB | పంతం నెగ్గించుకున్న ఇద్ద‌రు ఎమ్మెల్యేలు!

ఆదిలాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ బ్యూరో : నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవి ఎంపిక‌పై నెలకొన్న ప్రతిష్టంబన ఎట్టకేలకు తెరవీడింది. మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత దివంగత రాథోడ్ రమేష్ తనయుడు రితేష్ రాథోడ్ కు బీజేపీ పగ్గాలు అప్పగిస్తూ ఆ పార్టీ బుధవారం నియామక ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీకి గట్టి పట్టున్న నిర్మల్ జిల్లాలో అధ్యక్ష పదవి రేసులో మాజీ జిల్లా అధ్యక్షులు అంజిరెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, న్యాయవాది రవి పాండే పోటీ పడ్డారు. అయితే వీరిని కాదని మంచిర్యాల జిల్లాకు చెందిన హరినాయక్, ఉట్నూర్ ఎజెన్సీకి చెందిన రితేష్ కు బీజేపి సారథ్యం కట్టబెట్టాలని నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఇదే జిల్లాకు చెందిన ముథోల్ ఎమ్మేల్యే రామారావు పటేల్ పట్టుబట్టారు. పార్టీ సీనియర్లు, క్యాడర్ మాత్రం నిర్మల్ జిల్లా వాసులకే కీలక పగలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. చివరకు ఇద్దరు ఎమ్మెల్యేలు అధిష్టానంపై ఒత్తిడి తెచ్చి రితేష్ రాథోడ్ పేరును ప్రతిపాదించి తమ పంతం నెగ్గించుకున్నారు.

శివాజీ జ‌యంతి వేడుక‌ల్లో..
జిల్లా నూతన అధ్యక్షునిగా ఎన్నికైన రితేష్ బుధవారం ఉట్నూర్ లోని తన తండ్రి రమేశ్ సమాధి వద్ద నివాళులర్పించి అనంతరం షాంపూర్, నార్నూర్, ఉట్నూర్ లో జరిగిన శివాజీ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాలో పార్టీ సంస్థాగత పటిష్టత కోసం పాటుపడుతానని, రానున్న ఎన్నికల్లో సమన్వయం చేసుకొని సత్తా చూపుతామని రితేష్ తెలిపారు. బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా నిర్మల్ జిల్లాకు చెందిన ఐదుగురిని నియ‌మించారు. ఖానాపూర్ కు చెందిన ఆకుల శ్రీనివాస్, ఆడేపు లలిత, దశరథ్ (నిర్మల్), ముథోల్ కు చెందిన పోతుగంటి సతీష్ రావు, కేశెట్టి అశోక్ లను నియమిస్తూ పార్టీ రాష్ట్ర కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *