సేవకు మంచి మనసే మూలధనం..
పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న అమరావతి సేవా సమితి యువత!
పల్నాడు, ఆంధ్రప్రభ: నేటి యువతలో చాలా మంది తమ వ్యక్తిగత జీవితం, ఉద్యోగం, భవిష్యత్ లక్ష్యాలకే పరిమితమవుతున్న తరుణంలో, కొందరు యువకులు మాత్రం సమాజం కోసం సమయం కేటాయిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. “సాయం చేయడానికి ఉండాల్సింది డబ్బు కాదు.. మంచి మనసు” అనే భావనతో ముందుకు సాగుతున్న అమరావతి సేవా సమితి సభ్యులు తమ సేవా కార్యక్రమాల ద్వారా అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు.
పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన గొల్లపల్లి వీరాంజనేయులు సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూనే సమాజ సేవను తన బాధ్యతగా భావించారు. అదే ఆలోచనతో 2017లో ‘అమరావతి సేవా సమితి’ని స్థాపించి యువతను ఏకం చేశారు. చిన్న స్థాయిలో ప్రారంభమైన సేవా కార్యక్రమాలు నేడు విద్య, పర్యావరణ పరిరక్షణ, రోడ్డు భద్రత, సామాజిక చైతన్యం, నిరాశ్రయుల సంక్షేమం వంటి అనేక రంగాలకు విస్తరించాయి.
పుస్తకాలతో విజ్ఞాన వెలుగులు
సాంకేతిక యుగంలో మొబైల్ ఫోన్లు, సామాజిక మాధ్యమాల ప్రభావంతో పుస్తక పఠనం తగ్గిపోతున్న నేపథ్యంలో, యువతలో చదివే అలవాటు పెంపొందించేందుకు సమితి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. “ఫోన్లు వదలండి.. పుస్తకాలు పట్టండి” పేరుతో వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది.
‘పబ్లిక్ ఓపెన్ రీడింగ్ సెషన్’ ద్వారా చదువు, కెరీర్ మార్గదర్శకం, రాజ్యాంగం, చట్టాలు, మహనీయుల జీవిత చరిత్రలు, ఆరోగ్యం, విజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలను ప్రజలకు అందుబాటులో ఉంచింది. సత్తెనపల్లిలోని వావిలాల పార్కులో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విద్యార్థులు, యువత, మహిళలు, పిల్లలు, పెద్దల నుంచి విశేష స్పందన లభించింది.
పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం
ప్లాస్టిక్ వినియోగం పర్యావరణానికి తీవ్ర ముప్పుగా మారుతున్న నేపథ్యంలో సమితి సభ్యులు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. “ప్లాస్టిక్ సంచులు వద్దు.. జ్యూట్ సంచులే ముద్దు” అనే నినాదంతో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ, ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలను వివరిస్తున్నారు.
ప్రత్యామ్నాయంగా జ్యూట్, కాగిత సంచుల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ ఉచితంగా జ్యూట్ సంచులను పంపిణీ చేస్తున్నారు.
రోడ్డు భద్రత కోసం వినూత్న ప్రచారం
రోజురోజుకూ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు సమితి సభ్యులు వినూత్న పద్ధతులను అవలంబిస్తున్నారు. పోలీసు, రవాణా శాఖల సహకారంతో నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాల్లో యముడు, చిత్రగుప్తుల వేషధారణలో యువకులు రోడ్లపైకి వచ్చి హెల్మెట్ ప్రాముఖ్యతను వివరిస్తున్నారు.
హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వాహనదారులకు గులాబీ పువ్వులు అందజేసి ప్రేమతో అవగాహన కల్పించడం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తేనే ప్రాణాలను కాపాడుకోవచ్చని సభ్యులు చెబుతున్నారు.
విద్యార్థుల భవితకు చేయూత
“విద్యే అభివృద్ధికి పునాది” అనే నమ్మకంతో సమితి గత ఎనిమిదేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న నిరుపేద విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలు, పరీక్షా సామగ్రి, భోజన ప్లేట్లు పంపిణీ చేస్తోంది. దాతల సహకారంతో ఈ కార్యక్రమాలను నిరంతరంగా కొనసాగిస్తూ విద్యార్థుల చదువుకు అండగా నిలుస్తోంది.
బాల్య వివాహాల నిర్మూలనకు కృషి
సామాజిక సమస్యలపై కూడా సమితి ప్రత్యేక దృష్టి సారిస్తోంది. బాల్య వివాహాల వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక సమస్యలను వివరిస్తూ గ్రామాలు, కాలనీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. చిన్న వయసులో వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని ప్రజలకు తెలియజేస్తూ, బాలికల విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తోంది.
నిరాశ్రయులకు అండగా
చలికాలంలో రాత్రివేళ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రోడ్ల పక్కన నిద్రించే నిరాశ్రయులను గుర్తించి వారికి దుప్పట్లు పంపిణీ చేస్తున్నారు. అలాగే ఆహార ప్యాకెట్లు అందజేస్తూ ఆకలితో బాధపడుతున్న వారికి తోడ్పాటును అందిస్తున్నారు. మానవత్వమే తమ సేవా కార్యక్రమాల ప్రధాన లక్ష్యమని సభ్యులు పేర్కొంటున్నారు.
సేవలోనే ఆత్మసంతృప్తి
“మా సమితిలోని సభ్యులంతా సాధారణ కుటుంబాల నుంచి వచ్చి ఉన్నత చదువులు పూర్తి చేసిన వారే. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని నేడు వివిధ రంగాల్లో స్థిరపడ్డాం. మేము ఎదుర్కొన్న ఇబ్బందులు నేటి విద్యార్థులు ఎదుర్కోకూడదనే ఉద్దేశంతో సేవా కార్యక్రమాలు ప్రారంభించాం. దాతలను ప్రత్యక్షంగా కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడం వల్ల మరింత మంది ముందుకు వస్తున్నారు. సమాజానికి ఉపయోగపడుతున్నామనే భావన మాకు ఎంతో ఆత్మసంతృప్తిని ఇస్తోంది” అని అమరావతి సేవా సమితి అధ్యక్షుడు గొల్లపల్లి వీరాంజనేయులు తెలిపారు.
సేవకు డబ్బు కంటే మంచి మనసే ముఖ్యమని నిరూపిస్తున్న అమరావతి సేవా సమితి యువత, సమాజంలో సానుకూల మార్పుకు తమవంతు పాత్ర పోషిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది.

