గజరాజు చెరువు ఆక్రమణలపై హైకోర్టు సీరియస్
గజరాజు చెరువు ఆక్రమణలపై హైకోర్టు సీరియస్
రెవెన్యూ, మున్సిపల్ అధికారులకు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ: కొండపల్లి గజరాజు చెరువు ఆక్రమణలపై హైకోర్టు సీరియస్ అయింది. జూన్ 26 కల్లా సమగ్ర కౌంటర్ దాఖలు చేయాలని రెవెన్యూ, మున్సిపల్ అధికారులను ఆదేశించింది. 42.33 ఎకరాల గజరాజు చెరువులో 30 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు అధికారులు చెప్పడంతో న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది.
కొండపల్లి ఆర్ఎస్ నంబర్ 433 గజిట్ నోటిఫికేషన్ ప్రకారం వక్ఫ్ బోర్డులో ఉందని చెబుతున్న స్థలంలో ఐదు సెంట్లను ఆయుర్వేద ఆసుపత్రికి కేటాయిస్తూ కౌన్సిల్ తీర్మానం చేసింది. అనంతరం అక్కడ నిర్మాణం ప్రారంభించడంతో పట్టణానికి చెందిన ఓ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు ఆ స్థలం వక్ఫ్ బోర్డు ఆస్తి కాదని, గజరాజు చెరువు భూమి అని కౌంటర్ దాఖలు చేశారు. చెరువు భూమి అయితే ఆయుర్వేద ఆసుపత్రి నిర్మాణానికి ఎలా తీర్మానం చేశారని హైకోర్టు ప్రశ్నించగా, అధికారులు సమాధానం చెప్పలేకపోయారు.
దీంతో 42.33 ఎకరాల గజరాజు చెరువు పరిస్థితి ఏమిటని రెవెన్యూ, మున్సిపల్ అధికారులపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. గజరాజు చెరువు పరిధిలో ఎన్టీటీపీఎస్ సెక్టార్-2 క్వార్టర్స్, ఈఎస్ఐ ఆసుపత్రి, సాయిబాబా ఆలయం, మున్సిపల్ కాంప్లెక్స్, సచివాలయం, ఆయుర్వేద ఆసుపత్రి, చర్చి, పేదల ఇళ్లు ఉన్నట్లు తెలుస్తోంది.ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి భవన నిర్మాణాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్‌పై హైకోర్టు ధర్మాసనం కీలక విచారణ చేపట్టింది. గజరాజు చెరువు మొత్తం 42.33 ఎకరాల్లో ప్రస్తుతం 14.20 ఎకరాల్లోనే నీటి నిల్వ ఉన్నట్లు ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు.
మిగిలిన చెరువు భూమి ఆక్రమణలకు గురికావడంపై చీఫ్ జస్టిస్ లీసా గిల్, జస్టిస్ రఘునందనరావుల ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ప్రస్తుతం ఉన్న 14.20 ఎకరాల చెరువును రక్షించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని అధికారులను ఆదేశించింది.
ఆక్రమణకు గురైన మిగిలిన చెరువు స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై సమగ్ర కౌంటర్ దాఖలు చేయాలని రెవెన్యూ, మున్సిపల్ అధికారులను హైకోర్టు ఆదేశించింది.
చెరువు భూమిలో నిర్మాణాలు చేపడితే అది స్వయంకృతాపరాధమే అవుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆ స్థలంలో చేపట్టే నిర్మాణాలు కోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. భవిష్యత్తులో కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే, ఆ నిర్మాణాల కూల్చివేత ఖర్చు, నష్టం సంబంధిత సంస్థలదేనని హెచ్చరించింది.
తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది. ఆక్రమణలు తొలగించాల్సి వస్తే గతంలో నిర్మించిన ప్రభుత్వ భవనాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. అలాగే వందలాది అక్రమ నిర్మాణాల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.


