డంపింగ్ యార్డ్ రహితంగా అన్ని మున్సిపాలిటీలు..

డంపింగ్ యార్డ్ రహితంగా అన్ని మున్సిపాలిటీలు..

  • కొత్తగా ఆరు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ లు
  • 107 మున్సిపాలిటీల్లో ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్ లు
  • మంత్రి నారాయణ
  • ఇబ్రహీంపట్నంలో బయో గ్యాస్ ప్లాంట్ నిర్మాణ పనులు పరిశీలన

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను డంపింగ్ యార్డ్ రహితంగా తయారు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి పట్టణ పరిధిలోని ఇబ్రహీంపట్నం ఖిల్లా రోడ్డులో కొత్తగా నిర్మిస్తున్న బయో గ్యాస్ ప్లాంట్ ను స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ తో కలిసి మంత్రి నారాయణ శుక్రవారం పరిశీలించారు. ప్రస్తుతం విశాఖపట్నం, గుంటూరులో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ లు ఉన్నాయని చెప్పారు. కొత్తగా మరో ఆరు ప్లాంట్ లు నెలకొల్పుతున్నామని చెప్పారు. ఈలోగా మున్సిపాలిటీల్లో ఉత్పత్తి అయ్యే చెత్త ప్రాసెసింగ్ కోసం 107 మున్సిపాలిటీల్లో ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్ లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

ఈ ప్లాంట్ ల ద్వారా ప్రతి రోజు 5385 టన్నుల చెత్తను ప్రాసెసింగ్ చేసి కంపోస్ట్, బయో గ్యాస్ గా మారుస్తామని తెలిపారు. గత చెత్త ప్రభుత్వం చెత్త పన్ను వేసినా 150 లక్షల టన్నుల చెత్తను వదిలి వెళ్ళిపోయిందని విమర్శించారు. గత ప్రభుత్వం వదిలేసిన చెత్తను కూటమి ప్రభుత్వం తొలగిస్తుందన్నారు. వచ్చే నెలాఖరు నాటికి ప్లాంట్ లు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. కార్యక్రమంలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్, కొండపల్లి మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు, టీడీపీ రాష్ట్ర సీనియర్ నేత జంపాల సీతారామయ్య, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి అక్కల రామమోహనరావు (గాంధీ), కౌన్సిలర్ చనమోలు నారాయణ, ఇబ్రహీంపట్నం పీఏసీఎస్ చైర్మన్ కోయ నెహ్రూ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply