Destruction – Lebanon – Beirut- Photos I 2905 I లెబ‌నాన్‌, బీరూట్ లో విధ్వంసం

లెబ‌నాన్‌పై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు
భ‌యం గుప్పెట్లో ద‌క్షిణ లెబ‌నాన్‌, బీరూట్‌

Destruction – Lebanon – Beirut- Photos I 2905 I ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌, అంత‌ర్జాతీయం : మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్ చేప‌డుతున్న వైమానిక దాడులు దక్షిణ లెబనాన్‌, బీరూట్ ప్రాంతాల్లో తీవ్ర విధ్వంసానికి దారితీశాయి. బాంబు దాడులతో అనేక భవనాలు నేలమట్టమవగా, శిథిలాల మధ్య ప్రజలు ప్రాణాలు కాపాడుకునేందుకు ఆర్తనాదాలు చేస్తున్నారు. గాయపడిన చిన్నపిల్లలు, భయంతో ఇళ్లను విడిచి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్న కుటుంబాలు అక్కడి భయానక పరిస్థితిని ప్రతిబింబిస్తున్నాయి.

తాజా దాడుల్లో గురువారం ఒక్కరోజే సుమారు 20 మంది మరణించినట్లు స్థానిక వర్గాలు వెల్లడించాయి. వీరిలో దక్షిణ బీరూట్ ప్రాంతానికి చెందిన ఒక మహిళతో పాటు ఇద్దరు చిన్నపిల్లలు కూడా ఉన్నారు. మరోవైపు గాజా సిటీలో జరిగిన ఇజ్రాయెల్ దాడుల్లో కనీసం 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిలో చిన్నారులు కూడా ఉండటం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది.

దాడుల అనంతరం సహాయక బృందాలు శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఆసుపత్రులు గాయపడిన వారితో నిండిపోతుండగా, యుద్ధ ప్రభావంతో సాధారణ ప్రజల జీవనం పూర్తిగా దెబ్బతిన్నది. అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు పౌర ప్రాంతాలపై జరుగుతున్న దాడులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Leave a Reply