నేర నియంత్రణ లక్ష్యంగా..

నేర నియంత్రణ లక్ష్యంగా..
నల్గొండ, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు నల్లగొండ పట్టణాన్ని అష్ట దిగ్బందం చేసారు. నిరంతరం రద్దీ గల ప్రాంతాలు సతీష్ నగర్ తో పాటు ఇతర పలు ప్రాంతాల్లో 10 బృందలుగా ఏర్పాటు చేసారు. మంగళవారం తెల్లవారుజామున విస్తృత స్థాయిలో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, అనుమానితుల గుర్తింపు, అక్రమ కార్యకలాపాల అరికట్టడం లక్ష్యంగా ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ ఆపరేషన్ నల్లగొండ డిఎస్పీ శివరాం రెడ్డి ఆధ్వర్యంలో ఏడు మంది సీఐలు, 18 మంది ఎస్.ఐలతో నార్కోటిక్ డాగ్ తో కలిపి సుమారు 200 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని, పట్టణంలోని పలు కాలనీలు, అనుమానిత ప్రాంతాలు, లాడ్జీలు, అద్దె గదులు, రైల్వే స్టేషన్, బస్టాండ్, ప్రధాన కూడళ్ల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
పట్టణంలో సుమారు 360 ఇండ్లలో తనిఖీలు నిర్వహించగా, 46 మంది అనుమానితులను గుర్తించి వారి వివరాలు సేకరించి పరిశీలిస్తున్నారు. అదే విధంగా ఇతర రాష్ట్రాలకు చెందిన 18 మంది వ్యక్తులను గుర్తించారు. వీరిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 10 మంది, బీహార్‌కు చెందిన 4 మంది, తమిళనాడుకు చెందిన 1 వ్యక్తి, అస్సాంకు చెందిన 1 వ్యక్తి, హర్యానాకు చెందిన 2 మంది ఉన్నారు. తనిఖీలలో భాగంగా ఇద్దరు రౌడీషీటర్లు, 5 మంది ట్రబుల్ మాంగర్స్‌ను గుర్తించి వారి పై ప్రత్యేక నిఘా పెట్టారు. అలాగే ఆరుగురికి గంజా టెస్ట్ లు నిర్వహించగా వీరిలో ఇద్దరిని గంజా సేవించినట్లు గుర్తించడం జరిగింది.
అలాగే అక్రమంగా నిల్వ ఉంచిన 16 గుట్కా బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు, రిజిస్ట్రేషన్ సక్రమంగా లేని 54 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు (త్రిచక్ర వాహనాలు) వీటిలో అదిక శబ్దం కలిగిన 02 వాహనాలను స్వాధీనం చేసుకొని సంబంధిత కేసులు నమోదు చేస్తున్నారు. అదనంగా 4 సెల్ ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నేరచరిత్ర కలిగిన వ్యక్తులు, రౌడీషీటర్లు, శాంతిభద్రతలకు భంగం కలిగించే వారి పై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద వ్యక్తులు, అక్రమ కార్యకలాపాల పై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఇటువంటి ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని జిల్లా పోలీసు శాఖ వెల్లడించింది.
