బీజేపీ నాయకుల అరెస్టు అప్రజాస్వామికం..

బీజేపీ నాయకుల అరెస్టు అప్రజాస్వామికం..

ఊట్కూర్, ఆంధ్రప్రభ : బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి బీజేపీ నాయకులు తరలి వెళ్లకుండా పోలీసులతో ముందస్తు అరెస్టు చేయడం అప్రజాస్వామికమని బీజేపీ వాణిజ్య సెల్ జిల్లా కన్వీనర్ కృష్ణయ్య గౌడ్, ఉప సర్పంచ్ రమేష్, మాజీ మండల అధ్యక్షులు రమేష్ తీవ్రంగా ఖండించారు. సోమవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని ఆయా గ్రామాల బీజేపీ నాయకులను ఛలో అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ ప్రజల బతుకులను ఆగం చేస్తూ భావితరాల భవిష్యత్తు ప్రశ్నార్థకం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి అరాచక కమీషన్ల పాలనను ప్రజలకు తెలియచేసేందుకు రాష్ట్ర అధ్యక్షులు రామచందర్రావు అసెంబ్లీ ముట్టడికి పిలుపు ఇచ్చారు. అయితే.. ఈ ముట్టడికి వెళ్లకుండా అడ్డుకోవడం సిగ్గుచేటు అన్నారు. కార్యక్రమం విజయవంతం అవుతుందనే భయంతో అధికార పార్టీ అర్ధరాత్రి బీజేపీ నాయకుల ఇంటి వద్ద పోలీసులు కూర్చుని అక్రమ అరెస్టులు పాల్పడితే భారతీయ జనతా పార్టీ భయపడదే లేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

రాబోవు రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కులేదని అన్నారు. నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి ఉంటే ఈ రోజు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని బీజేపీ చేపట్టేది కాదు కదా.. రాబోవు రోజులో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం ఆగదని హెచ్చరించారు. బీజేపీ నాయకుల అరెస్టు అప్రజాస్వామికం అన్నారు. ఈ కార్యక్రమంలో భాజపా డి. హన్మంతు, పెద్దపొర్ల మాజీ సర్పంచ్ రవి, లక్ష్మీపల్లి మాజీ సర్పంచ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply