ఎన్నికలకు ఏకీకృత వేదికగా ఈసీఐనెట్
- ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలపై పూర్తిస్థాయి అవగాహన అవసరం
- ఓటర్ల జాబితా రూపకల్పనకు పటిష్ట సన్నద్ధత ఉండాలి
- ఈసీఐ అండర్ సెక్రటరీ రాజేష్ కుమార్ సింగ్
విజయవాడ, ఆంధ్రప్రభ: ఈసీఐనెట్.. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) రూపొందించిన ఏకీకృత డిజిటల్ వేదిక అని.. గతంలో వేర్వేరుగా ఉన్న ఎన్నికల యాప్‌లు, పోర్టళ్ల సేవలను ఒకే ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఈసీఐ అండర్ సెక్రటరీ రాజేష్ కుమార్ సింగ్ అన్నారు. ఇందులోని సేవలపై ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, ఇతర ఎన్నికల సంబంధిత అధికారులకు అవగాహన కీలకమని పేర్కొన్నారు.
కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికకు సంబంధించి నవంబర్ 1 అర్హత తేదీగా ఓటర్ల జాబితా రూపొందించాల్సి ఉన్నందున సన్నద్ధతలో భాగంగా ఈసీఐ అండర్ సెక్రటరీ రాజేష్ కుమార్‌సింగ్ నేతృత్వంలో అధికారులు రోహిత్ కుమార్, స్వతంత్ర కుమార్ మీనా బృందం నియోజకవర్గంలో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టరేట్ శ్రీ ఏవీఎస్ రెడ్డిహాల్లో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, ఈఆర్వోలు, ఏఈఆర్వోలతో ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొంది. ఎన్నికలకు సంబంధించి సాంకేతిక వినియోగాన్ని యూజర్ ఫ్రెండ్లీగా తీర్చిదిద్దే లక్ష్యంతో రూపొందించిన ఈసీఐనెట్ ఏకీకృత పోర్టల్‌లో వివిధ అంశాలను ఈసీఐ ఐటీ విభాగం కన్సల్టెంట్ ఎస్వీ మల్లికార్జున్ పీపీటీ ద్వారా వివరించారు.
ఓటర్ల జాబితా రూపకల్పనకు సంబంధించి నోటిఫికేషన్ నుంచి తుది జాబితా ప్రచురణ వరకు ఉండే వివిధ అంశాలను వివరించారు. అనంతరం ఈసీఐ బృందం జిల్లా అధికారుల నుంచి పోర్టల్‌లో చేయాల్సిన మార్పులు చేర్పులపై సూచనలను స్వీకరించింది. ఏ ఎన్నికలకు అయినా కచ్చితమైన ఓటర్ల జాబితా కీలకమని.. ఈ నేపథ్యంలో అధికారులు ప్రతి అంశంపైనా ముందే పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించుకోవాలని.. ఎన్నికల నియమ నిబంధనలు, ఈసీఐ మార్గదర్శకాలపై స్పష్టత ముఖ్యమని ఈసీఐ అండర్ సెక్రటరీ రాజేష్ కుమార్ సింగ్ పేర్కొన్నారు.
సమావేశంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, విజయవాడ, నందిగామ, తిరువూరు ఆర్డీవోలు వెన్నెల శ్రీను, జి.అనిల్‌కుమార్, ఎ.కుమార్ తదితరులు పాల్గొన్నారు.

