ఆగస్టు 1 నుంచి అరైవ్ అలైవ్ స్పెషల్ డ్రైవ్

ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠిన చర్యలు.. ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్

భూపాలపల్లి, ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించి, ప్రతి ప్రయాణాన్ని సురక్షితంగా మార్చే లక్ష్యంతో ఆగస్టు 1 నుంచి అరైవ్ అలైవ్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు.

జిల్లా పోలీసు శాఖ, రవాణా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టనున్నట్లు ఎస్పీ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్వహించే ఈ డ్రైవ్‌లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

జిల్లాలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో అధికశాతం నిర్లక్ష్యపు డ్రైవింగ్, అతివేగం, హెల్మెట్, సీటుబెల్ట్ వినియోగించకపోవడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వంటి కారణాల వల్ల జరుగుతున్నాయని ఎస్పీ పేర్కొన్నారు.

ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా 18 ఏళ్లలోపు మైనర్లు వాహనాలు నడపడం, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపడం, ట్రిపుల్ రైడింగ్, అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, సీటుబెల్ట్ ధరించకపోవడం, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం, రాంగ్‌రూట్ డ్రైవింగ్ వంటి ఉల్లంఘనలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు.

మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టవిరుద్ధమని, అలాంటి సందర్భాల్లో వాహన యజమానులు, తల్లిదండ్రులు లేదా సంరక్షకులపై మోటారు వాహనాల చట్టం ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించి చిన్నప్పటి నుంచే పిల్లలకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలని సూచించారు.

ప్రతి వాహనదారుడు ఐఎస్‌ఐ ప్రమాణాల హెల్మెట్ ధరించడం, సీటుబెల్ట్ తప్పనిసరిగా వినియోగించడం, ట్రాఫిక్ సంకేతాలను గౌరవించడం, వేగ పరిమితులను పాటించడం, మద్యం సేవించి వాహనాలు నడపకపోవడం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగాన్ని నివారించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని ఎస్పీ తెలిపారు.

రోడ్డు భద్రత కేవలం పోలీసు శాఖ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ పేర్కొన్నారు. ప్రజల సహకారంతోనే ప్రమాదరహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించి అరైవ్ అలైవ్ స్పెషల్ డ్రైవ్‌ను విజయవంతం చేయాలని కోరారు.