మహిళా శక్తికి నిలువెత్తు నిద‌ర్శ‌నం..

మహిళా శక్తికి నిలువెత్తు నిద‌ర్శ‌నం..

పాలనలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ప్రకృతి రక్షణలో ఐఎఫ్ఎస్ అధికారిణి జి. కృష్ణ ప్రియ..
సామాజిక మార్పుకు దిక్సూచిగా నిలుస్తున్న మహిళా మణులు..

ప‌ల్నాడు బ్యూరో, ఆంధ్ర‌ప్ర‌భ‌ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) అంటే కేవలం శుభాకాంక్షలు చెప్పుకోవడం మాత్రమే కాదు.. ప్రతి మహిళ తన జీవిత ప్రయాణంలో ఎదుర్కొనే సవాళ్లను, సాధించే విజయాలను గౌరవించుకునే సందర్భం. మహిళలు తమ కలల కోసం సమాజంతోనూ, కొన్నిసార్లు కుటుంబంతోనూ పోరాడాల్సి వస్తుంది. విద్య, ఉద్యోగం లేదా నచ్చిన రంగంలో రాణించడానికి వారు చూపే పట్టుదల ఎందరికో ఆదర్శం. ఓటమి ఎదురైనా తిరిగి నిలబడటం ఆమె నైజం. ఒకే సమయంలో ఒక మహిళ అనేక పాత్రలను పోషిస్తుంది. ఆమె ఒకే రోజులో వృత్తి నిపుణురాలిగా ఆఫీసు పనులను సమర్థవంతంగా నిర్వహిస్తుంది. కుటుంబానికి వెన్నెముకగా ఇంటి బాధ్యతలు, పిల్లల పెంపకం చూసుకుంటుంది. క్లిష్ట సమయాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటుంది.

ఒక పురుషుడికి విద్యను అందిస్తే.. ఒక వ్యక్తికి మాత్రమే అందుతుంది కానీ.. ఒక మహిళకు విద్యను అందిస్తే.. ఆ కుటుంబం మొత్తానికి అందుతుంది. ఆడపిల్లగా పుట్టినప్పటి నుండి ప్రతి అడుగులోనూ ఎంతో నేర్చుకుంటూ, ఎదుగుతూ సమాజానికి దిశానిర్దేశం చేసే ప్రతి మహిళా ఒక స్ఫూర్తిప్రదాతే. ఆమె లేనిదే ఈ ప్రపంచం లేదు. ఈ క్ర‌మంలో అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్బంగా జిల్లా క‌లెక్ట‌ర్ కృతికాశుక్లా, అట‌వీశాఖ అధికారి పి కృష్ణ ప్రియ‌ల జీవితాలు ఎంద‌రికో స్పూర్తిగా నిలుస్తాయ‌న‌టంలో సందేహం లేదు.

లక్ష్యసాధనలో ధ్రువతార జిల్లా క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా..
హ‌ర్యానాలోని ఒక విద్యావంతులైన కుటుంబంలో జన్మించిన కృతికా, చిన్నప్పటి నుండే చదువులో ఎంతో చురుకైనది. ఆమె తండ్రి మదన్‌లాల్ బాత్రా స్టాక్ బ్రోకింగ్ రంగంలో ఉండగా, తల్లి హర్ష బాత్రా ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్‌గా సేవలందించారు. క్రమశిక్షణ, సామాజిక బాధ్యత గల వాతావరణంలో పెరిగిన కృతికా తన విద్యాభ్యాసాన్ని అత్యున్నత స్థాయిలో పూర్తి చేశారు. విద్యాభ్యాసం, సివిల్ సర్వీసెస్ ప్రయాణంకృతిక ఢిల్లీలోని ప్రతిష్టాత్మకమైన శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుండి బీ.కామ్ (ఆనర్స్), హన్స్‌రాజ్ కాలేజ్ నుండి ఎం.కామ్ పూర్తి చేశారు. అంతటితో ఆగకుండా పంజాబ్ యూనివర్సిటీ నుండి ఫిలాసఫీలో పీహెచ్‌డీ పట్టా పొందారు. తన 24వ ఏటనే, అంటే 2012లో సివిల్ సర్వీసెస్ పరీక్షలో 103వ ర్యాంకు సాధించి, 2013 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణిగా ఎంపికయ్యారు.

మొదట జమ్మూ కాశ్మీర్ క్యాడర్‌కు ఎంపికైనప్పటికీ, తోటి ఐఏఎస్ అధికారి హిమాంషు శుక్లాని వివాహం చేసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు బదిలీ అయ్యారు. అంకితభావంతో కూడిన పరిపాలన ఆమె తన వృత్తి జీవితంలో మహిళా సంక్షేమం, శిశు అభివృద్ధి, విద్యా రంగాల్లో చెరగని ముద్ర వేశారు.

ఆమె చేపట్టిన కొన్ని ముఖ్యమైన బాధ్యతలు:
మహిళా, శిశు సంక్షేమం : మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా, దిశ స్పెషల్ ఆఫీసర్‌గా మహిళల భద్రత కోసం ఎంతో కృషి చేశారు.
జిల్లా పరిపాలన: కాకినాడ జిల్లా కలెక్టర్‌గా, గుంటూరు, కృష్ణా జిల్లాల జాయింట్ కలెక్టర్‌గా క్షేత్రస్థాయిలో పాలనను ప్రజలకు చేరువ చేశారు.
విద్యా సంస్కరణలు: ప్రస్తుతం ఇంటర్మీడియట్ విద్యా శాఖ డైరెక్టర్‌గా ఉంటూ విద్యా రంగంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. కేవలం అధికారిణిగానే కాకుండా, ఇద్దరు పిల్లలకు తల్లిగా తన వృత్తిని, వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. 2049 జనవరి 31 వరకు ఆమె తన సుదీర్ఘ సేవలందించనున్నారు. పట్టుదల ఉంటే ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చని నిరూపిస్తూ, నేటి తరం మహిళా సివిల్ సర్వీసెస్ ఆకాంక్షకులకు కృతికా శుక్లా ఒక గొప్ప రోల్ మోడల్.

ఐఎఫ్ఎస్ అధికారిణి జి. కృష్ణ ప్రియ.

సవాళ్లను అధిగమిస్తూ ప్రకృతి సేవలో మహిళలు.
త‌మ వృతి ప‌ర‌మైన అనుభావాలు పంచుకున్న ఐఎఫ్ఎస్ అధికారిణి జి. కృష్ణ ప్రియ..

ప్రకృతిని రక్షించడం ఒక గొప్ప సేవ అని, అటవీ శాఖలో మహిళలు అన్ని స్థాయిల్లోనూ అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్నారని ఐఎఫ్ఎస్ అధికారిణి జి. కృష్ణ ప్రియ కొనియాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె తన వృత్తిపరమైన అనుభవాలను, మహిళా సాధికారత పై తన అభిప్రాయాలను పంచుకున్నారు.


సవాళ్లకు ఎదురొడ్డి..
2016 బ్యాచ్‌కు చెందిన కృష్ణ ప్రియ డెహ్రాడూన్‌లో రెండేళ్ల పాటు కఠినమైన శిక్షణ పొంది అటవీ విభాగంలోకి ప్రవేశించారు. అటవీ శాఖలో అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ నుంచి డిఎఫ్‌ఓ స్థాయి వరకు ఎంతో మంది మహిళలు పని చేస్తున్నారని ఆమె గుర్తు చేశారు. మనుషులు వెళ్లలేని ప్రాంతాలకు వెళ్లడం, అటవీ భూమిని, వన్యప్రాణులను రక్షించడం మాకు నిత్యం ఒక సవాలుతో కూడుకున్న పని. అడవుల్లో పెట్రోలింగ్‌కు వెళ్లినప్పుడు మొబైల్ నెట్‌వర్క్ కూడా ఉండదు. కనీసం కుటుంబ సభ్యులకు కాల్ చేయడం కూడా సాధ్యపడదు. అయినప్పటికీ.. పనిని, కుటుంబాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు” అని ఆమె వివరించారు.

ఫిట్‌నెస్ మంత్రం:
వృత్తిరీత్యా ఎంత బిజీగా ఉన్నా ఆరోగ్యం పై దృష్టి సారించడం ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. తాను క్రమం తప్పకుండా బ్యాడ్మింటన్ ఆడతానని, ప్రతి ఏటా ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ తరపున ‘ఆల్ ఇండియా ఫారెస్ట్ స్పోర్ట్స్ మీట్’లో పాల్గొంటానని తెలిపారు. క్రీడల వల్ల మానసిక ప్రశాంతతతో పాటు శారీరక దృఢత్వం (ఫిట్‌నెస్) లభిస్తుందని ఆమె సందేశమిచ్చారు.

పిల్లల పెంపకంలో మార్పు రావాలి..
మహిళా దినోత్సవం సందర్భంగా సమాజానికి ఆమె ఒక ముఖ్యమైన సందేశాన్ని అందించారు. ఆడపిల్లలను ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో పెంచాలి. తాము ఎవరికీ తీసిపోమనే నమ్మకాన్ని వారిలో నింపాలి. మ‌గ‌పిల్ల‌లను కూడా స్త్రీలను గౌరవించేలా, సమానత్వానికి విలువ ఇచ్చేలా పెంచినప్పుడే నిజమైన మార్పు సాధ్యమవుతుంది. అటవీ రక్షణలో నిమగ్నమైన తోటి మహిళా ఉద్యోగులందరికీ అభినంద‌న‌లు తెలుపుతూ, రాష్ట్ర ప్రజలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply