నాణ్యమైన విత్తనాలు రైతులకు అందించాలి..
- రైతు సంఘం జిల్లా నాయకులు బొల్లం అశోక్
తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ : సాగు భూమి కలిగిన ప్రతి రైతుకు యాప్ తో సంబంధం లేకుండా యూరియా సరఫరా చేయాలని, పెండింగ్ లో ఉన్న రైతు భరోసా నిధులు విడుదల చేయాలని, రైతు సంఘం జిల్లా నాయకులు బొల్లం అశోక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం రోజు మండల కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ఆర్ ఐ విక్రమ్ జూనియర్ అసిస్టెంట్ ప్రవీణ్ రెడ్డి లకు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. అనంతరం తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకులు బొల్లం అశోక్, మండల కార్యదర్శి కొత్త వెంకట్ రెడ్డిలు మాట్లాడుతూ, వ్యవసాయ సీజన్ ప్రారంభమైందని, రైతులకు కల్తీ విత్తనాలు, పురుగుమందులు అందకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, నాణ్యమైన విత్తనాలు రైతులకు సరఫరా చేయడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల పెరుగుదలకు అవకాశం ఉంటుందన్నారు పంట కాలువలు మరమ్మతులు లేక చివరి భూములకు సాగునీరు ప్రవహించే అవకాశం లేకుండా పోయిందని , మరమ్మతులు చేయాలి అన్నారు. రబి సీజన్లో మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన మొక్కజొన్న రైతులకు పెండింగ్ డబ్బులను వెంటనే జమ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సంవత్సరం కరువు పరిస్థితులు రాబోతున్నట్టు తెలుస్తుందని అందుకోసం ప్రభుత్వం తక్షణ స్పందించి యాక్షన్ ప్లాన్ రూపొందించి రైతులను ఆదుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎండి యాకూబ్ , మండల అధ్యక్షురాలు అందే మంజుల రైతు సంఘం నాయకులు తాళ్ల వెంకటేశ్వర్లు వీరయ్య, కోటగిరి సంతోష్, శ్రీరంగం రాధా రామకృష్ణ, భాగ్య ,సమీనా, అమీనా, శ్రీలత ,లక్ష్మి ,స్వర్ణ, రైతు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
