4-Family-Murder : అవి సుఫారీ హత్యలే ?Andhra Prabha Crime Story
4-Family-Murder : అవి సుఫారీ హత్యలే ?Andhra Prabha Crime Story
- ఆత్మహత్యలు కాదు
- ఆస్తి కోసమే.. చంపేశారు
- హసీనా తొలి భర్త కూతురే సూత్రధారి
- నల్లగొండలో నలుగురి హత్య పై వీడిన మిస్టరీ?
- పోలీసుల అదుపులో నిందితులు ?
ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ :
నల్లగొండ పట్టణంలోని తెలంగాణ కాలనీలో ఈనెల 22వ తేదీన వెలుగులోకి వచ్చిన ఒకే ఇంటిలో నలుగురి మరణం పై మిస్టరీ వీడింది. సుల్తాన్ (45), ఆయన భార్య హసీనా (40), కుమారుడు ముజామిల్ (20), కూతురు అపోరా (11) లు దారుణ హత్యకు గురైనట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ఈ హత్యలపై పోలీసులు అధికారికంగా ఎలాంటి సమాచారం అందించకపోయినా ఈ నలుగురిని దారుణంగా హత్య చేసిన హసీనా మొదటి భర్త కూతురు, అల్లుడు, అల్లుడు సోదరితోపాటు మరో ఐదుగురు కిరాయి హంతకులను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకొని హత్యలకు గల కారణాలను గుర్తించినట్లు తెలిసింది.
4-Family-Murder : ఆస్తి దక్కదనే…
హసీనా పేరుపై విలువైన ఆస్తులు ఉండడంతో ఆ ఆస్తి ముజామిల్, అపోరాలకే చెందుతుందన్న అక్కసు తో హసీనా మొదటి భర్త కూతురు, అల్లుడు ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం. 22వ తేదీన తెలంగాణ కాలనీలో ని సుల్తాన్ ఇంటిలో నాలుగు మృతదేహాలను గుర్తించిన పోలీసులు ఈ కేసు చిక్కుముడిని విడదీసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. వివిధ కోణాలలో వారి మరణాలపై విచారణ చేపట్టారు. మొదట కుటుంబం సామూహిక ఆత్మహత్యలకే పాల్పడిందని భావించారు. పోస్టుమార్టం నివేదికలో మృతులను పదునైన ఆయుధంతో పొడిచి చంపారని నిర్ధారణ కావడంతో పోలీసులు నిందితులను గుర్తించడంలో తీవ్రంగా శ్రమించారు. మృతదేహాలు లభించిన ఇల్లు పూర్తిగా పట్టణానికి శివారు ప్రాంతం కావడం ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు లేకపోవడం, నిందితులు ఎలాంటి ఆధారాలను వదిలిపెట్టకపోవడంతో ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిందితుల జాడ తెలుసుకునేందుకు పది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మృతుల కుటుంబ సభ్యులను వీరికి ఎవరెవరితో తగాదాలు ఉన్నాయని విచారణ చేశారు. మొదట ముజామిల్ ప్రేమ వ్యవహారమే ఈ హత్యలకు కారణమై ఉండొచ్చు అన్న భావనతో కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ నిర్వహించారు. వారి నుండి హత్యకు సంబంధించిన ఎలాంటి కారణాలు తెలియకపోవడంతో ఆస్తి తగాదాలు ఏమైనా కారణం ఉండొచ్చు అన్న దిశగా పోలీసులు విచారణ చేపట్టారు.
4-Family-Murder : ఇది సుఫారీ మర్డరే
ఈ విచారణలో హసీనా మొదటి భర్త సంతానంతో ఆస్తి తగాదాలు జరుగుతున్నట్లు గుర్తించిన పోలీసులు హైదరాబాదులో నివాసం ఉంటున్న హసీనా మొదటి భర్త కూతురు, అల్లుడిని అదుపులోకి తీసుకొని విచారించగా తామే ఈ దారుణానికి పాల్పడ్డట్లు అంగీకరించినట్లు విశ్వసనీయ సమాచారం. కిరాయి హంతకులకు సుఫారీ ఇచ్చి పథకం ప్రకారం ఒకేసారి నలుగురిని హత్య చేసినట్లు తెలిసింది. ఎలాంటి ఆధారాలు లేని ఈ కేసులో జిల్లా పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విచారణ చేపట్టి హంతకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు ఈ రోజు రేపు మీడియా సమావేశం పెట్టి అధికారికంగా వెల్లడించనున్నట్లు తెలిసింది. ఎలాంటి ఆధారాలు లభించని ఈ కేసులో పోలీసులు విచారణ చేపట్టిన తీరును పలువురు అభినందిస్తున్నారు.
