ఘనంగా జిల్లా స్థాయి తైక్వాండో ఛాంపియన్‌షిప్ పోటీలు
అచ్చంపేట, ఆంధ్రప్రభ: క్రీడలు యువతలో శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, పబ్లిక్ క్లబ్ మాజీ అధ్యక్షులు పోకల మనోహర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, పబ్లిక్ క్లబ్ మాజీ అధ్యక్షులు వెన్ను శ్రీనివాసులు అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం అచ్చంపేట పబ్లిక్ క్లబ్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి తైక్వాండో ఛాంపియన్‌షిప్–2026 పోటీలను వారు ప్రారంభించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన సబ్‌జూనియర్, క్యాడెట్, జూనియర్, సీనియర్ విభాగాల క్రీడాకారులు క్యోరుగి, పూమ్సే విభాగాల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తైక్వాండో వంటి మార్షల్ ఆర్ట్స్ యువతలో ఆత్మరక్షణ నైపుణ్యాలతో పాటు ఏకాగ్రత, పట్టుదల పెంపొందిస్తాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా తల్లిదండ్రులు, క్రీడా సంఘాలు ప్రోత్సాహం అందించాలని సూచించారు.
తెలంగాణ రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కే. శ్రీహరి మాట్లాడుతూ తైక్వాండో ఒలింపిక్ క్రీడగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని తెలిపారు. విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా కింద రెండు శాతం రిజర్వేషన్ అమలులో ఉందని, ఈ అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన 46 మంది క్రీడాకారులను ఆగస్టు 8, 9, 10 తేదీల్లో కరీంనగర్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ఎంపికైన వారు అక్టోబర్‌లో మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు.
కార్యక్రమంలో పబ్లిక్ క్లబ్ అధ్యక్షులు అంగిరేకుల బిక్షపతి, తైక్వాండో అసోసియేషన్ నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షులు కానోజ్ మనోహర్ ప్రసాద్, కార్యదర్శి బి. శేఖర్, కోచ్‌లు, రెఫరీలు, న్యాయనిర్ణేతలు, క్రీడాకారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
